విశాఖ సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు డ్యామ్
భద్రత బాధ్యతల అప్పగింత రిలీవ్ అయిన
ములుగు సిఆర్‌పిఎఫ్ బలగాలు ఇక
ప్రాజెక్టు అంతా ఆంధ్ర చేతుల్లోకే కెఆర్‌ఎంబి
నిర్ణయమంటున్న అధికారులు జలవివాదం
సమసిపోక ముందే రిలీవ్ చేయడంపై
మండిపడుతున్న తెలంగాణవాదులు
ఇప్పటికే వాటాకు మించి నీళ్లు వాడుకుంటున్న
ఎపి సాగర్,శ్రీశైలం రెండూ ఆంధ్ర చేతుల్లోనే
డ్యామ్ గేటు వద్ద బిఆర్‌ఎస్‌శ్రేణులధర్నా
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: బహుళార్థసార్థక ప్రాజెక్టు నాగార్జునసాగర్.. తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగునీరు.. పాత నల్లగొం డ, ఖమ్మం జిల్లాలు.. అటు ఆంధ్రప్రదేశ్‌కు సా గు, తాగునీటిని అందించే ప్రాజెక్టు. ఈ డ్యాం కు ఇరువైపులా పటిష్టమైన సాయుధ బలగాల తో ఇటు తెలంగాణ.. అటు ఆంధ్ర పోలీసుల తో పాటు సిఆర్‌పిఎఫ్ కేంద్ర బలగాలు పహా రా కాస్తుండేవి. గట్టి నిఘాతో భద్రతను కట్టుది ట్టం చేశారు.కృష్ణానది పరివాహక ప్రాంతమం తా తెలంగాణలోనే ఉండటంతో సాగర్ భద్రత తెలంగాణలో చేతిలో ఉండేది. కానీసాగర్‌లో జలవివాదం జరిగి ఆంధ్ర పోలీసులు కూడా అక్కడ తిష్టవేశారు. ఈ పరిస్థితి కొంతకాలం గా సాగుతోంది.అయితే ఉన్నట్టుండి తెలంగాణ వైపు ఉన్న కేంద్ర సిఆర్‌పిఎఫ్ బలగాలను ఉపసంహరింపజేశారు. అక్కడ నుండి తెలంగాణలోని ములుగు బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్ బలగాలను రిలీవ్ చేశారు. ఇప్పు డు సాగర్ డ్యాం భద్రత అంతా ఆంధ్ర చేతిలో కి వెళ్ళిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నీటి కేటాయింపుల కంటే ఎక్కువగా వాడుకుంటుండటం.. ఎప్పుడూ నీటి పంపిణీపై జలవివాదం కొనసాగుతూనే ఉంది. జలవివాదం సమసి
పోకముందే సాగర్ డ్యాం భద్రత నుండి తెలంగాణ సిఆర్‌పిఎఫ్ బలగాలను పంపించేయడంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) నిర్ణయమని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఏంజరుగుతుందోననే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. అటు శ్రీశైలం.. ఇటు సాగర్ రెండింటి భద్రతలు ఆంధ్ర చేతుల్లోకి వెళ్ళడం.. కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న సంబంధాలతోనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఇదే పరిస్థితి ఉంటే కృష్ణా జలాల్లో నీటి వాటాలు.. వాడకంపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.
కొనసాగుతున్న నీటివాటాల వివాదం..
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రధానమైన ప్రాజెక్టులు. ఇవి రెండు ఆంధ్ర, తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టులు. అయితే విభజన సమయంలో కృష్ణానీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 811టిఎంసిలు (68.8 శాతం).. తెలంగాణకు 299 టిఎంసిలు (31.2 శాతం) నీటి వాటాలు కేటాయించారు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ కొట్లాడుతోంది. కృష్ణా బేసిన్‌లో పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ నీటి కేటాయింపులు తక్కువగా ఇచ్చారని మండిపడుతున్నారు. బేసిన్‌లో నీటినిల్వలో సగభాగం ఇవ్వాల్సిందేనని కృష్ణానది యాజమాన్య బోర్డు( కెఆర్‌ఎంబి)కి లేఖ రాసింది. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి ప్రభుత్వం కొట్లాడుతోంది. కెఆర్‌ఎంబి కేంద్రం చేతిలో ఉండటంతో ఆ సమస్య ఇంకా కొలిక్కి రావడంలేదు.
శ్రీశైలంలో ఎపి.. సాగర్‌లో తెలంగాణ
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రాజెక్టుల భద్రత కూడా ఆయారాష్ట్రాలు చూసుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉండటంతో అక్కడి భద్రత ఎపి ప్రభుత్వానికి అప్పగించారు. సాగర్ డ్యాం భద్రతను తెలంగాణకు అప్పగించారు. అక్కడ.. ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్) భద్రతను చూసుకునేది. కానీ ఎపి ప్రభుత్వం నీటివాటాల కంటే ఎక్కువగా వినియోగిస్తుండటంతో రెండేళ్ళ క్రితం వివాదం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర మధ్య గట్టి యుద్ధంగానే జరిగింది. కెఆర్‌ఎంబి ఉభయ రాష్ట్రాలకు నచ్చచెప్పచడంతో వెనక్కి తగ్గారు.
శ్రీశైలంలో ఎపి భద్రతనే కొనసాగిస్తున్నారు. అయితే సాగర్‌లో మాత్రం 14 నుండి 26వ గేటు వరకు తమదే అంటూ ఎపి బలగాలు అక్కడే ఉంటున్నాయి. దీంతో సాగర్‌లో ఆంధ్ర వైపు విశాఖ సిఆర్‌పిఎఫ్ బలగాలు.. తెలంగాణ వైపు ములుగు సిఆర్‌పిఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. వీరితో పాటు తెలంగాణ స్పెషల్ పోలీస్.. ఆంధ్ర స్పెషల్ పోలీసులు భద్రతను చూసుకుంటున్నారు. అయితే మంగళవారం తెలంగాణ వైపు ఉన్న ములుగు సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌ను అక్కడ నుండి రిలీవ్ చేశారు. ఆ బాధ్యతలు విశాఖ సిఆర్‌పిఎఫ్‌కు అప్పగించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీశైలం, సాగర్ ప్రధాన డ్యాంలపై భద్రత అంతా ఆంధ్ర చేతిలోకి వెళ్ళింది.
డ్యామ్ గేటు వద్ద బిఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా
నాగార్జునసాగర్ డ్యాం భద్రత వైజాగ్ సిఆర్‌పిఎఫ్ భద్రతా బలగాలకు అప్పజప్పినందుకు నందికొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శ్రేణులు మెయిన్ డ్యాం గేటు వద్ద ధర్నా, నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎస్‌పిఎఫ్ సిబ్బంది ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా భద్రతను కాపాడారని, అదేవిధంగా ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం డ్యాం భద్రత తెలంగాణ ఎస్‌పిఎఫ్ సిబ్బందికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో ప్రభుత్వం మెయింటెనెన్స్ చేస్తున్నప్పటికీ ఆ రోజుల్లో ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేశారని అన్నారు.
ఆంధ్ర సిఆర్‌పిఎఫ్ ఆధీనంలో డ్యాం ఉంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సంప్రదింపులు చేసుకొని తెలంగాణ ఎస్‌పిఎఫ్ సిబ్బందికి డ్యాం భద్రత మొత్తం అప్పజెప్పాలని, లేనిపక్షంలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మణ్ నాయక్, మక్షుద్, శేఖరాచారి, గాజుల రాము, కాంపల్లి రామస్వామి, యేసు, గడ్డమీది రవి, కృష్ణ, హైమద్ తదితరులు పాల్గొన్నారు.