Sunday, December 22, 2024

నేను హోంమంత్రి అయితేనే బిఆర్‌ఎస్ నేతలు కంట్రోల్‌లో ఉంటారు

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ
నాకు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నా
అందుకు అధిష్ఠానం కూడా హామీ ఇచ్చింది
కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని, అందుకు అధిష్ఠానం కూడా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోకి వచ్చిందే కెసిఆర్‌ను గద్దె దించేందుకని, తాను హోంమంత్రి అయితేనే బిఆర్‌ఎస్ నేతలు కంట్రోల్‌లో ఉంటారని తెలిపారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు, జగదీశ్‌రెడ్డితో సహా అయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదనేది తమ ఉద్దేశ్యమని అన్నారు. పార్టీ అదేశిస్తే పోటీ చేస్తామని, ఎవరికి సీటు ఇచ్చినా గెలిపిస్తామని తెలిపారు. త్వరలో బిఆర్‌ఎస్‌ను బిజెపిలో విలీనం చేస్తారని, కెసిఆర్‌కు బిజెపియే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

కెటిఆర్, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీమంత్రి కెటిఆర్ మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కెటిఆర్ ‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అన్నా?’ అని ప్రశ్నించారు. మీ లానే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కెటిఆర్ అన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కెటిఆర్ అడిగారు. దయచేసి తనను కాంట్రవర్సీలోకి లాగవద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News