నేడు ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం
అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ
అభ్యర్థుల ప్రకటనతో కామ్రేడ్లతో పొత్తుపై స్పష్టత
గతంతో పోలిస్తే ఈసారి 15రోజుల ముందుగానే జాబితా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆయా పార్టీలు అభ్యర్ధుల వేటలో తలమునకలయ్యాయి. కానీ బిఆర్‌ఎస్ అన్ని పార్టీలకంటే ముందుగా ఎన్నికల రేసులో దూసుకుపోతోంది. ఈ మేరకు ఆపార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈసారి 15 రోజుల ముందుగానే అభ్యర్థుల జాబితా విడదలవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2018లో సెప్టెంబర్ 6న జాబితాను విడుదల చేయగా, ఈసారి ఇంకా ముందుగానే విడుదల చేస్తున్నారు. మిగిలిన పార్టీల రాకెట్ వేగంతో బిఆర్‌ఎస్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించి సిట్టింగ్‌లకు ఈసారి ఢోకాలేదని భావిస్తున్నారు.
తెలంగాణా భవన్ వేదికగా 96 నుంచి 105 మందితో జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని అంటున్నారు. దాదాపు సిట్టింగులకే సీట్లు ఖరారయ్యే అవకాశం ఉందని, కొన్ని చోట్ల అవసరం మేరకే అభ్యర్థుల మార్పుజరుగుతుందని కూడా విశ్వసనీయ సమాచారం. కూర్పులో భాగంగా ఈసారి బిఫాం ఇవ్వలేని వాళ్లను, అసంతృప్తులను ఇప్పటికే బుజ్జగించిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం వారిని సరైన విధంగా గౌరవిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎన్నికల్లో అవకాశం దొరకని వాళ్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఏదో ఒక కీలక పదవి తప్పకుండా ఇస్తామని అధినేత హా మీ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ, వాడవాడకూ తిరిగి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని వాలని కూడా పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వంద సీట్లను గెలుచుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకుని, అందుకు అనుగుణంగానే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.
కమ్యూనిస్టులతో పొత్తుపై ఉత్కంఠ
ఇదిలా వుండగా ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు తప్పనిసరిగా ఉంటుందని ఇప్పటికే ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. అయితే సీట్ల పంపకాల విషయంలో ఇంకా ఎటూ తేలలేదని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరో మూడు సీట్లను కోరుతున్నట్టు సమాచారం. అయితే బిఆర్‌ఎస్ మాత్రం చెరో సీటు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సోమవారం బిఆర్‌ఎస్ మొదటి జాబితా అనంతరం కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు, సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.