Thursday, January 23, 2025

వెనకబడిన వర్గాలకు కొండంత అండగా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

అడక్కుండానే ప్రజల అవసరాలు తీరుస్తున్న సిఎం కెసిఆర్
బిఆర్‌ఎస్ మేనిఫెస్టోతో బిజెపి గుండెల్లో రైళ్లు: మంత్రి సత్యవతి రాథోడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన బిఆర్‌ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. సబ్బండ వర్గాలకు కొండంత అండ కలిగించేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో కాంగ్రెస్, బిజెపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. అధికారంపై కాంగ్రెస్, బిజెపి నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందన్న బలమైన నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అందుతున్నదని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీ, ఇవ్వని హామీలను కూడా చేసి చూపించారని స్పష్టం చేసారు. కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, రైతుబంధు పెంపు, ఆసరా పెన్షన్ పెంపు, కెసిఆర్ ఆరోగ్య రక్ష, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ. 15 లక్షలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు రూ. 3 వేల భృతి, పేదలతో పాటు జర్నలిస్టులకు రూ. 400 కే రాయితీ సిలిండర్, అగ్రవర్ణ కులాల కోసం ప్రతి నియోజకవర్గానికో గురుకులం, మహిళా స్వశక్తి గ్రూప్‌లకు స్వంత భవనంతో పాటు ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగించడం తదితర హామీలివ్వడం తెలంగాణ ప్రజల పట్ల సిఎం కెసిఆర్ చిత్త శుద్ధికి నిదర్శనమని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పదేళ్ళ పాలనలో చేపట్టిన పథకాలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని, ప్రజలంతా ఆలోచించి ఓటేసి మూడోసారి కూడా బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News