Monday, December 23, 2024

మరో ‘మహా’ గర్జన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మూడో సభకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభలు విజయవంతంగా కావడంతో ఫుల్ జోష్‌లో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ సోమవారం ఔరంగాబాద్‌లో జరగనున్న మూడో సభకు విస్తృత ఏర్పాటు చేసింది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బిఆర్‌ఎస్ ఇప్పుడు మధ్య మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలో తలపెట్టిన మూడో సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బిఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో సోమవారం(ఏప్రిల్ 24) జబిందా మైదాన్‌లో జరగనున్న సభకునిర్వహించే బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ నగరమంతా గులాబీమయమైంది. ఈ సభకు రెండు లక్షలకుపైగా ప్రజలకు హాజరు కావచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

భారీ సంఖ్యలో జనం హాజరుకానున్నందుకు సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందుకు కలుగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్యవేక్షించనున్నారు. సభా వేదిక, నాయకులు, ప్రజలు సౌకర్యవంతంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఔరంగాబాద్‌లోని బీడు బైపాస్ రోడ్డులోని జబిందా మైదాన్‌లో సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, తెలంగాణ ఐడిసి చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, బిఆర్‌ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ, బిఆర్‌ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు హర్షవర్ధన్ జాదవ్, ప్రవీణ్ జథేవాడ్, శంకరన్నా ధోండ్గే తదితరులు పర్యవేక్షిస్తున్నారు. భారీ జనసమీకరణపై చేయడంపై బిఆర్‌ఎస్ తెలంగాణ, మహారాష్ట్ర నేతలు దృష్టి సారించి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేశారు.

బిఆర్‌ఎస్ సభపై విస్తృత చర్చ

మరాఠ్వాడాకు కేంద్రమైన ఛత్రపతి శంభాజీనగర్ ఔరంగాబాద్‌లో సోమవారం నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. మరాఠ్వాడకు ముఖ్యకేంద్రమైన ఔరంగాబాద్‌లో బిఆర్‌ఎస్ సభ ప్రాధాన్యత సంతరించుకున్నది. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న బిఆర్‌ఎస్ నినాదం విస్తృత చర్చకు కారణమతున్నది. దేశ చరిత్రను మార్చబోతున్న బిఆర్‌ఎస్ పార్టీలో తామూ భాగస్వామ్యం అయ్యేందుకు మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతున్నారు. ఔరంగాబాద్ చుట్టుపక్కల నియోజక వర్గాల్లోని గ్రామాల్లో బిఆర్‌ఎస్ డిజిటల్ ప్రచార రథాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయి.

ఔరంగాబాద్ వేదికగా తెలంగాణ మోడల్‌ను వివరించనున్న సిఎం

ఔరంగాబాద్ వేదికగా మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మోడల్‌ను సిఎం కెసిఆర్ వివరించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇప్పటికే ప్రజలకు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు, సిఎం కెసిఆర్ నాయకత్వానికి ఆకర్షితులై మహారాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వానికి మద్దతు ప్రకటిస్తూ ఔరంగాబాద్ స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. కంధార్-లోహా సభ అనంతరం ఔరంగాబాద్‌లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజల నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది పథకాల విశిష్టతను డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల కంధార్-లోహా బహిరంగ సభకు ముందు అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఔరంగాబాద్‌లోనూ అమలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News