Saturday, December 28, 2024

ఖమ్మం జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం గుమ్మంలో బుధవారం జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో జిల్లాకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లును కురిపించారు. జిల్లావాసులు అబ్బురపడేలా కెసిఆర్ ప్రకటించిన వరాలతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ, సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ఖమ్మంవాసులకు వి వెంకటాలపాలెం కలెక్టరేట్ సమీపంలో జరిగిన బహిరంగ సభ ద్వారా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కోట్లాది రూపాయల వరాలను కుమ్మరించారు.
మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్లు
జిల్లాలోని ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
జిల్లాలో 589 గ్రామ పంచాయతీలకుగాను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. అదేవిధంగా 10వేల జనాభాకు మించి ఉండి, మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న పెద్దతండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి గ్రామ పంచాయతీలు ఒక్కోదానికి రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు
మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తలా రూ.30కోట్లు
ఖమ్మానికి జెఎన్‌టియు
అదేవిధంగా జిల్లాకు చెందిన రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరిక మేరకు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి రూ.50కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. దాంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తలా రూ.30కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఖమ్మంలో జెఎన్‌టియు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మంత్రి పువ్వాడ విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిఎం ప్రకటించారు. కాగా, ఖమ్మం నడిబొడ్డునుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగుపై నూతన వంతెన నిర్మాణం చేయనున్నట్టు సిఎం హామీ ఇచ్చారు.
నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సిఎం కెసిఆర్ జర్నలిస్టుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రి అజయ్, కలెక్టర్ విపి గౌతమ్ నేతృత్వంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం గుర్తించి ఇండ్ల స్థలాలివ్వాలని, లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ వెనువెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News