Monday, December 23, 2024

బిసిలను అవమానిస్తే తీవ్ర పరిణామాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ తదితరులు హెచ్చరించారు. బుధవారం ఆదర్శ నగర్ లోని ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో పలువురు బిసి ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ముక్త కంఠంతో ఖండించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, ఎంపిలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బిబి పాటిల్, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్‌లతో పాటు ఇంకా పలువురు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ తదితరులు మాట్లాడుతూ బిసిలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిసి లు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. బిసి ల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు. అదేవిధంగా కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ వస్తుందని వివరించారు. అనేక విధాలుగా తమ ఎదుగుదలకు అండగా నిలిచినా బిఆర్‌ఎస్ పార్టీ వెంట ఉన్నారని, దీన్ని జీర్ణించు కోలేక బిసిల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి ప్రభృతులపై మండిపడ్డారు.

అధికారంలో ఉన్నంతకాలం బిసి లను కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని, వారి అభివృద్దిని విస్మరించారని విమర్శించారు. బిసిల జోలికొస్తే బిసి నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలలో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటాయని, ఈ విధమైన వ్యక్తిగత, నోటికొచ్చిన పదాలను వాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత, కుల వృత్తులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ విధానమా ? అనేది పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బిసి సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించి ప్రకటిస్తామని వారు చెప్పారు. మా ఓట్లతో గెలిచి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

గ్రామాలలో తిరగనీయకుండా అడ్డుకుంటామని వారు అన్నారు. బిసిలను అణిచివేయాలనే లక్ష్యంతో బిసి నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని వారు ధ్వజమెత్తారు. తమ జోలికి వస్తే అన్ని బిసి సామాజిక వర్గాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయని హెచ్చరించారు. బిసిలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బిసిలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 130 సంవత్సరాల చరిత్ర తమ పార్టీది అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కాదని, పార్టీ నాయకులు మాట్లాడే బాషను మార్చుకోవాలని, అలాంటి వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. బిసి లు అంటే అసమర్ధులు అనుకోవద్దని, తాము బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నందున హుందాగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎంతవరకైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. బిసి లు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజులలో మా సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

బిసిలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని, మా ఓట్ల తో గెలిచి..మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్నారని వారు మండిపడ్డారు. సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకు పోతుంటే ఆక్రోషంతో బిసిలపై మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ విధానాలను ఎండగడతామని, గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ బిసిల పై చేస్తున్న వ్యతిరేక విధానాలను వివరిస్తామన్నారు. ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణను తొందరలో ప్రకటిస్తామన్నారు. కూలాల వారిగా మీటింగ్ లు పెడుతామని, ముక్కు , చెంపలు వేసుకుంటే తప్పా వారిని వదలమన్నారు. ఈ దిశగా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సమాజంలో సగభాగం ఉన్న తాము ప్రాణాలైనా అర్పిస్తం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమానత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. తాము మేం బానిసలం కాదని, చైతన్యవంతులమని అన్నారు. వెనుకబడిన వర్గాలను నేతలను టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ తిట్టడం మానుకోవాలని వారు హితవు పలికారు. కాంగ్రెస్ అధినాయకత్వం విధానం కూడా వెనుకబడిన వర్గాలను దూషించడమేనా అనేది వారు స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్ లోని బిసి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

వెనుకబడిన వర్గాలకు మొత్తం సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. మాపై అన్యాయం జరిగితే కులాలుగా కాదు బిసి సమాజంగా ప్రశ్నిస్తాం.. తిరగబడతాం అని వారు అన్నారు. మీలాగా బిసిలను వెనుకబడిన వర్గాలను దూషిస్తూ మేము మాట్లాడలేం మాకు సిఎం కెసిఆర్ సంస్కారం నేర్పారు అని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలను కులవృత్తులను ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ వేల కోట్లతో ఆత్మగౌరవభవనాలు వేలాది గురుకులాలను వెనుకబడిన వర్గాల కోసం నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్, గంగుల ప్రభృతులు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News