Saturday, March 15, 2025

బిఆర్‌ఎస్ నిరసనల హోరు

- Advertisement -
- Advertisement -

జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై
రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
పిలుపు మేరకు ఆందోళనలబాట
అనేకచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వ
దిష్టిబొమ్మల దహనం
కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై ఫిర్యాదులు

మన తెలంగాణ/హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ టూ ఆలంపూర్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నినదించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ గొంతు నొక్కేందుకే సిఎం రేవంత్ రెడ్డి సస్సెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమైన అసెంబ్లీని తన నియంతృత్వ పోకడలతో రేవంత్ రెడ్డి భ్రష్టుపట్టించారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా చేయని రేవంత్ రెడ్డి, తన చేతకానితనం బయటపడొద్దనే అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకులపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజా కోర్టులో తేల్చుకుంటామన్నారు. పార్టీ పిలుపు మేరకు తెలంగాణ గ్రామ గ్రామాన సమరోత్సాహంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టిన కార్యకర్తలు, నాయకులకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు శాసనసభ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని సస్పెన్షన్ చేయడం కక్షపూరితమైన చర్య అని బిఆర్‌ఎస్ ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తల్లి ప్రాంగణ ఎదుట ప్రధాన రహదారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను దహనం చేశారు. ప్రజల తరపున శాసనసభలో ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆరు గ్యారెంటీలు,

హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం 15 నెలలుగా ప్రజల తరపున పోరాటం చేస్తున్న, ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ నేతలపై, జర్నలిస్టులపై కేసులు పెడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా గద్వాల నియోజకవర్గం పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి బాసు హనుమంతు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. వనపర్తి జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్‌ఎస్ నాయకులు దగ్ధం చేశారు. హోలీ సంబ రాల మాటున బిఆర్‌ఎస్ నేతలు గుట్టు చప్పుడు కాకుండా అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో ఉద్రిక్తత
బీఆర్‌ఎస్ నగర శాఖ తెలంగాణ చౌక్‌లో చేపట్టిన ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ చౌక్‌లో ప్రభుత్వ దిష్టి బొమ్మను బీఆర్‌ఎస్ నేతలు దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నేతల చేతుల్లోంచి దిష్టి బొమ్మను పోలీసులు లాగేందుకు యత్నించగా ఇరువర్గాలు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు దిష్టి బొమ్మను లాక్కొని వాహనంలో తరలించారు. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్దమని నేతలు తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేయకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ గౌడ్, మైనార్టీ అధ్యక్షుడు మీర్ శౌకత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఏంటి అని బీఆర్‌ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ప్రశ్నించారు. పట్టణంలోని బస్టాండ్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఇంచార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీఆర్‌ఎస్ చెన్నూరు నియ్జోకవర్గం ఇంచార్జి డాక్టర్ రాజా రమేష్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వరెడ్డి సస్పెన్షన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం స్థానిక రాజీవ్ చౌక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News