బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్
హైదరాబాద్ : కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయమని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్ అన్నారు. దక్షిణ భారతం నుంచి బిజెపిని ప్రజలు తరిమేస్తున్నారనడానికి ఇది నిదర్శనమని విమర్శించారు. బిజెపిని తరుమడానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని అనుకోవచ్చని పేర్కొన్నారు. శనివారం ఆంధోల్ ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించనే విషయం బిజెపికి అర్ధమయ్యేలా కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు.
అయితే కర్ణాటక ఫలితాలను చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలను కాపీ కొట్టి కర్ణాటక ఎన్నికల మేనిఫస్టోలో చేర్చిన విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని అన్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవే హామీలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయారని, అయినా తెలంగాణ ప్రజలు వారిని నమ్మలేని విషయాన్ని మర్చిపోరాదని గుర్తు చేశారు. కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌పైనే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని క్రాంతికిరణ్ స్పష్టం చేశారు.