తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు
ట్విట్టర్ వేదికగా రేవంత్‌పై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని నిప్పులు చెరిగారు. మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ సోయి లేనోడు సిఎం కావడం మన ఖర్మ అని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు, ముఖ్యమంత్రి గా ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు, గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది? అని ప్రశ్నించారు.
ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్ కన్నా, మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నీకు నచ్చిందా..? అని నిలదీశారు. నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్ పై.. నిప్పులు !, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. గొప్పలా ?, ఇదేం నీతి.. ఇదేం రీతి.. అని దుయ్యబట్టారు. తెలంగాణ మోడల్ అంటే.. సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునామా, అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్, యావత్ దేశానికే నచ్చిన మోడల్ అని అన్నారు. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్ అని తెలిపారు.
దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..నిన్ను చరిత్ర క్షమించదు అని రేవంత్‌పై కెటిఆర్ నిప్పులు చెరిగారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని ఆగ్రహం కనబర్చారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బిఆర్ఎస్, కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.