Sunday, January 19, 2025

కారు దిగిన మరో ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో పాటు మునిసిపల్ చైర్మన్, కార్పొరేట్లర్లు, ఎంపిపిలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటివరకు 8మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బిఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలు ఇప్పటికే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మాజీ ఎంపిలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నేడు లేదా మరో నలుగురు ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పిసిసి వర్గాలు వెల్లడించాయి.

సిఎం రేవంత్ రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉంటారు: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
సిఎం రేవంత్ రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉంటారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యువకుడు, తెలివైన వారని ఆయన ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానని ఆయన చెప్పారు. ఎవరెవరు పార్టీ మారుతారన్న దానిపై స్పష్టత లేదని, తాను మాత్రం ఒంటరిగానే చేరుతున్నానని ఆయన పేర్కొనారు. రూలింగ్ పార్టీలో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

గతంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ నాయకత్వంలో కొంత అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎవరిపై బురద జల్లేది లేదన్నారు. భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్న కెటిఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ బెదిరించడానికి తామేమి చిన్నపిల్లలం కాదన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్ట ప్రకారమే కాంగ్రెస్‌లోకి వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు. చంద్రబాబు తన రాజకీయ గురువు అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News