రాజకీయ వర్గాల్లో పార్టీ మారుతారనే ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆదివారం సిఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం వీరి సమావేశంలో రాజకీయాల్లో చర్చ సాగుతుంది. వరుసగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం వెనుక రహస్యమేమిటని సరికొత్త చర్చ మొదలైంది.
వారం రోజుల కితం మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిశారు. దీంతో అదే రోజు వారంతా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. దానికి వారు క్లారిటీ ఇచ్చి మర్యాదపూర్వక సమావేశమని తేల్చి చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఒంటరిగా వెళ్లి సిఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే గత పాలకులు జైలు బాట పడుతారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.