Sunday, January 19, 2025

గేట్లు తెరిస్తే రావడానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గొర్రెలు కాదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను అవమానించేలా మాట్లాడినందుకు సిఎం క్షమాపణలు చెప్పాలి
కుత్భుల్లాపూర్ ఎంఎల్‌ఎ కెపి. వివేకానంద

మనతెలంగాణ/హైదరాబాద్ : మేము గేట్లు తెరిస్తే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలంతా వస్తారని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. గేట్లు తెరిస్తే రావడానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఏం గొర్రెలు కాదని కుత్భుల్లాపూర్ ఎంఎల్‌ఎ కెపి వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను అవమానించేలా మాట్లాడినందుకు సిఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి ఏదో అభద్రతాభావంలో ఉన్నారని, సొంత పార్టీపైనే పట్టు లేకుండా భయం భయంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలపై పట్టు లేకుండా సిఎం తమ పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మానసికస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనే అభద్రతతో సిఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో హామీలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని తమ పార్టీ ఎంఎల్‌ఎల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నుంచే ఏక్ నాథ్ షిండేలు వస్తారని బిజెపి నేతలు అంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రపోతోందని.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే రేవంత్ కేవలం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చిందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుంటే దానిపై మాట్లాడేవారు లేరని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ఎందుకు ప్రకటించడం లేదని రేవంత్‌రెడ్డి అంటున్నారని, తమ పార్టీ నిర్ణయాలు తాము తీసుకుంటామని, తమ పార్టీ గురించి సిఎంకు ఎందుకు అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రి పదవికి కలంకం తెచ్చే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించారు. ఒకరి ఎత్తు గురించి, అందం గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కెపి. వివేకానంద ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News