Sunday, December 22, 2024

జాబ్ క్యాలెండర్ దగా.. గన్‌పార్క్ ముందు బిఆర్‌ఎస్ నిరసన

- Advertisement -
- Advertisement -

జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లు, ఎంఎల్‌సిలు గన్‌పార్క్ వద్ద నిరసనకు దిగారు. బిఆర్‌ఎస్ సభ్యులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చే పట్టిన బిఆర్‌ఎస్
నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కెటిఆర్ మధ్య వాగ్వాదం నెలకొంది. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా.. ఇదేనా ప్రజాపాలన అని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పోలీసులను ప్రశ్నించారు.

పోలీసులు వారిని పోలీసులు అరెస్టు చేసి, బస్సులో తరలించారు. కాగా బస్సులోనూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ప్రభుత్వానికి వ్యరేతికంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు. రెండు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 9 నెలల కిందట ఉద్యోగాల పేరుతో ఎంత డ్రామా చేశారో అందరూ చూశారని, కెసిఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలంటూ పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో ప్రకటనలు ఇచ్చారని, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలేవీ..? అని నిలదీశారు. క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయి..కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏవీ..? అని అడిగారు. కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్ని తరిమే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అందుకే నాలుగు కాగితల మీద ఏది పడితే అది రాసుకొచ్చి, అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో 2 ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

రాహుల్, రేవంత్ రెడ్డిలు దమ్ముంటే అశోక్ నగర్‌కు రావాలి: కెటిఆర్ సవాల్
దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్‌కు రావాలని కెటిఆర్ సవాల్ విసిరారు. తాము కూడా వస్తామని అన్నారు. అశోక్ నగర్‌లో విద్యార్థులు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పినా సరే తామంతా రాజీనామా చేస్తామని పేర్కొన్నారు. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలంటూ తాము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మగాడైతే సిటి సెంట్రల్ లైబ్రరీకి రావాలని సవాల్ విసిరారు. ఆయన అక్కడికి వస్తే విద్యార్థులు తన్ని తరిమేస్తారని హెచ్చరించారు.

గురువారం రాత్రి 46 జిఒను సవరించాలంటూ దిల్‌సుఖ్ నగర్‌లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని, అటు బిల్లుల కోసం 1800 మంది సర్పంచులు సచివాలయం ముట్టడిస్తే వారిని అరెస్ట్ చేశారని అన్నారు. మార్పు, మార్పు అంటూ నిరుద్యోగులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రేవంత్ రెడ్డి ఎవరితో గోక్కోకూడదో వారితో గొక్కున్నారని అన్నారు. కావాలనే నిరుద్యోగులను, యువతను రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్, అందులో తారీఖులు తప్ప ఏమీలేదని విమర్శించారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్ ఇచ్చి శాసనసభను కౌరవ సభగా మార్చారని మండిపడ్డారు.

శాసనసభ దుశ్సాసన సభగా మారింది: హరీశ్‌రావు
శాసనసభ దుశ్సాసన సభగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం తప్పు ఎత్తి చూపితే మైకు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కన్న తల్లులను అవమానపరిచేలా ఒక శాసన సభ్యుడు మాట్లాడితే మైక్ ఎందుకు కట్ చేయరని ప్రశ్నించారు. దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారముందని అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపరకు పాల్పడుతోందని మండిపడ్డారు. బడే భాయ్, చోటా భాయ్‌లాగా సభలో బిజెపి, కాంగ్రెస్ కూడబలుక్కొని పనిచేస్తున్నాయని ఆరోంచారు. ఈరోజు విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ అని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

శాసనసభను కౌరవ సభలా జరుపుతూ మందబలంతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. వృద్దులకు, మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చకు ప్రభుత్వం బయపడిందని, చర్చ చెయ్యమంటే చెయ్యకుండా పారిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టమని హెచ్చరించారు. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా..?: హరీశ్‌రావు
ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం మహిళా ఎంఎల్‌ఎలను అవమానించారని మండిపడ్డారు. సభ నాయకుడే తమ ఎంఎల్‌ఎలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దానం నాగేందర్ మాట్లాడే భాష… రౌడీ షీటర్ మాట్లాడే భాషలా ఉన్నదని, కన్న తల్లులను అవమానించే దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారని, దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా..? అని నిలదీశారు. ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయని అడిగారు. జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్ లెస్ క్యాలెండర్ బోగస్ అయిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News