త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మారుతారని ప్రచారం
సమస్యలను చెప్పుకోవడానికే మంత్రిని
కలిశామని ఆరుగురు ఎమ్మెల్యేల వివరణ
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మా రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందలు ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యేలు అందించారు. జీహెచ్‌ఎంసికి నిధులు విడుదల చేయాలని వారు మంత్రిని కోరారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వలేదని వారు మంత్రితో పేర్కొన్నారు. కూకట్ పల్లి నియోజకర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని, దోమలను నివారణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లలో ఎలక్ట్రికల్ పోల్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో నెలకొన్న శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే కూకట్ పల్లి నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా పనులు చేపడుతామన్నారు. తప్పకుండా ఆయా నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
త్వరలోనే జంప్?
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏడుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రేపో,మాపో బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతోపాటు బిఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ఇప్పటికే పలువురు మంత్రులు చెప్పిన నేపథ్యంలో దాదాపుగా ఈ ఎమ్మెల్యేల చేరిక లాంఛనమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన గ్రేటర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల, కార్పొరేటర్‌ల సమావేశానికి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, ప్రస్తుతం మంత్రి శ్రీధర్‌బాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కావడం వల్లే మంత్రి శ్రీధర్‌బాబును కలిసినట్టు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు పేర్కొనడం విశేషం.