Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ది చెబుతారని బిఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రవీంద్రకుమార్‌లు బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్‌లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారన్న అహంకారంతో ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read: నూతన సచివాలయం నిర్మాణం, ప్రత్యేకతలు

ఓటుకు నోటు దొంగ నీతులు చెబితే నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. తిడితే పబ్లిసిటీ వస్తుందని రేవంత్ మాట్లాడుతున్నారని, మంత్రి జగదీష్‌రెడ్డి ఆస్తులపైన మాట్లాడుతున్నారని ఇది పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఆస్తుల గురించి చర్చిద్దామని మంత్రి జగదీష్ రెడ్డి గతంలోనే సవాల్ విసిరారని ఆయన పేర్కొన్నారు. నల్లగొండలో పన్నెండు కు పన్నెండు సీట్లు గెలిచామని, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలను ఎన్నికల్లో మట్టి కరిపించామన్నారు. కోమటి రెడ్డి నల్లగొండ జిల్లాకు చేసిన ఒక్క మంచి పని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జానారెడ్డి తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి తన కాంట్రాక్టు పైసల కోసం అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామా చేశారని, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్, కలెక్షన్‌ల కోసమే డ్రామాలు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తే నల్లగొండ ప్రజలు నాలుక కొసి, బట్టలు విప్పి ఊడదీస్తారని ఆయన హెచ్చరించారు. ఓట్ల రూపంలో జిల్లా ప్రజలు వీళ్ల చేష్టలు చూసి నవ్వుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

రాహుల్‌కు శిక్ష పడితే కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు: ఎంపి
రాహుల్ గాంధీకి శిక్ష పడితే నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని ఎంపి లింగయ్య యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ పక్కన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు బాడీ గార్డుల్లా నిలబడటం సిగ్గు చేటన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్‌ను నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, అప్పుడు వైఎస్ బూట్లు నాకారని, ఇప్పుడు మోడీ బూట్లు నాకుతున్నారని, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పొద్దున ఏం మాట్లాడుతారో రాత్రి ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. కాంగ్రెస్ నాయకుల మొహాలకు ఎపుడైనా నల్లగొండ నేతలు పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మోకాళ్ల మీద నడిచినా ఆ పార్టీకి నల్లగొండలో డిపాజిట్లు రావన్నారు.

Also Read: కాంగ్రెస్ వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ నల్లగొండ లో జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగ నాయకుల సభ అని, మా ఆత్మీయ సమ్మేళనంలో ఒక్క మండలానికి వచ్చిన జనం కూడా నల్లగొండ కాంగ్రెస్ సభకు రాలేదన్నారు. రేవంత్ భాష పిసిసి అధ్యక్షుడి స్థాయికి సరిపోతుందా, రాజకీయ విధానాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. రేవంత్ లాంటి వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అర్థం కాదనీ, కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్లు బాగుంటే సరిపోతుందని అనుకుంటారన్నారు. టిఆర్‌ఎస్ కార్యాలయాలు కట్టుకుంటే తప్పేమిటీఅని, కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలని, అభివృద్ధి మీద మాట్లాడటానికి దేవర కొండలో కనీసం మంచి నీళ్లు కూడా కాంగ్రెస్ నేతలు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కెసిఆర్ కాలిగోటికి సరిపోరన్నారు.

పైకి నవ్వులు లోపల కత్తులు: ఎమ్మెల్యే సైదిరెడ్డి
ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో కాంగ్రెస్ నాయకులు తమ ఉద్యోగాల కోసం సభ పెట్టుకున్నారని నిరుద్యోగుల కోసం కాదన్నారు. ఆ సభను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. పైకి నవ్వులు లోపల కత్తులు అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. మహాత్మాగాంధీ అంబేడ్కర్ తర్వాత అంతటి గొప్ప నాయకుడు కెసిఆర్ అని, ఎవరైనా పిహెచ్‌డి చేయాలనుకుంటే కెసిఆర్ రాజకీయ వ్యక్తిత్వం మీద చేయాలన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన ఉద్యోగాలు 24 వేలు మాత్రమేనన్నారు. దేశంలో కెల్లా అధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. నల్లగొండలో పన్నెండుకు పన్నెండు సీట్లు మళ్లీ గెలిచేది బిఆర్‌ఎస్ అని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాను కెసిఆర్ సస్యశ్యామలం చేశారు: ఎమ్మెల్యే బొల్లం
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎడారిగా మార్చిన నల్గొండ జిల్లాను కెసిఆర్ సస్యశ్యామలం చేశారన్నారు. అసహనంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహారిస్తున్నారన్నారు.

ఇక్కడి పథకాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయా: ఎమ్మెల్యే నోముల
ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ నల్లగొండ కాంగ్రెస్ సభ నిరుద్యోగులకు ఏ మాత్రం ఉపయోగపడని సభగా ఆయన పేర్కొన్నారు. తమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చెప్పాలన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాల్లో కనీసం పది శాతమైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News