హైదరాబాద్: రిజర్వేషన్లలో మహిళలకు అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నా చౌక్ లో నిరసన చేపట్టనున్నట్లు కవిత వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్ లో నల్ల బెలూన్లతో నిరసన చేపడుతామని పేర్కొన్నారు. ఉద్యోగ రిజర్వేషన్లలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. గురుకుల నియమకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిపారు. గురుకుల నియామకాల్లో మహిళలకు 12 శాతమే దక్కాయన్న కవిత, 626 ఉద్యోగాల్లో 77 మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు కనీసం 33% వాటా దక్కకుండా తెచ్చిన జీవో 3ను రద్దు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ ఇస్తున్న ఉద్యోగాలన్నీ కెసిఆర్ చేపట్టినవేనని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ డిఎస్సీ మాత్రమేనని పేర్కొన్నారు. గురుకుల పోస్టులు ఆరోహణ క్రమంలో నింపడం సరికాదని కవిత మండిపడ్డారు.