రాజ్యసభ సభ్యులుగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం చేయించారు. ఈ సంద ర్భంగా ఛైర్మన్ ధనఖర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు పలువురు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం
ఇనగుర్తి గ్రామంలో 1964 మార్చి 22న జన్మించిన వద్దిరాజు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బిఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో బండ ప్రకాశ్ రాజ్యసభకు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సీటు వద్దిరాజును వరించిన విషయం విదితమే. 2022 మే 24న ఈ పదవికి ఎన్నికైన వద్దిరాజు కేవలం రెండేండ్లే ఎంపిగా కొనసాగారు. ఇటీవలే వద్దిరాజు పదవీకాలం పూర్తవడంతో ఆయనకు మరోసారి కెసిఆర్ అవకాశం కల్పించారు.