Thursday, December 26, 2024

దేశానికే ఉషోదయం బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

చరిత్రలో విజేతలున్నారు. కాని “అధ్యయనం, దార్శనికత, విశ్వనీయత, రాజనీతిజ్ఞత” కలిగిన ‘లెనిన్, స్టాలిన్, వాషింగ్టన్, అబ్రహాంలింకన్, గాంధీ, నెహ్రూ, మావో, డెంగ్ సియావో పింగ్ వంటి ప్రజానేతలు అతి కొద్ది మందే! అరుదైన అట్టి ప్రజానేతల్లో కెసిఆర్ ఒకరు! వ్యవసాయాభివృద్ధి ద్వారా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసి రష్యాలో స్టాలిన్, చైనాలో డెంగ్ సియావో పింగ్ విజేతలయ్యారు. అచూవిచ (అనుభవం, చూడటం, వినటం, చదవటం) ద్వారా నిరంతర జ్ఞానార్థి అయిన కెసిఆర్ చైనా ప్రగతి రహస్యాన్ని గ్రహించారు! అదేమిటంటే చైనా, భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలలో 60% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. కావున వ్యవసాయాభివృద్ధి ద్వారా సదరు ప్రజల కొనుగోలు శక్తిని (ఆదాయాలను) పెంచితే వివిధ వస్తువులను కొంటూ వాళ్ళు పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడతారు.

ప్రజా కొనుగోలు శక్తి కలిగిన చోటికి దేశ దేశాల నుండి పరిశ్రమలు వచ్చేస్తాయి. పరిశ్రమలు పెరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది! అలా దేశ సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయాభివృద్ధే దృఢమైన పునాది అని స్టాలిన్, డెంగ్ సియావో పింగ్‌లు నిరూపించారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు పరచి విజేత అయ్యారు కెసిఆర్! ఆ స్ఫూర్తితోనే నేడు భారత దేశ ప్రగతి సాధనకు నడుం బిగించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
నాడు మీడియా ప్రచార ప్రభంజనం, తన మాటల మాయాజాలంతో గద్దె నెక్కిన మోడీని తమ ఆశాజ్యోతిగా భావించారు కష్టజీవులు. ఎందుకంటే ఆయన ఛాయ్ అమ్మి బతికిన కష్టజీవి, బిసి. అందువలన తమను కష్టాల సాగరం నుండి తప్పక గట్టెక్కిస్తాడు మోడీ అనుకుంటూ ఆశగా ఎదురు చూశారు.

CM KCR announced the National Party

కాని తాను బిసి (వెనుకబడ్డ కులా)ల కోసం గాదు, బిసి (బిగ్ కార్పొరేట్ల)ల ప్రగతి కోసమే శ్రమిస్తానని, తన పాలన ద్వారా చాటి చెప్పారు మోడీ! తన ప్రగతి కోసం కృషి చేయకపోగా, తమను కార్పొరేట్లకు కట్టు బానిసల్ని చేసే కార్మిక చట్టాలు! అన్నదాతల పంట పొలాలను కార్పొరేట్లకు కట్టబెట్టే రైతు చట్టాలు! తమ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్మే చట్టాలను తెచ్చారు మోడీ! అంతే గాదు ప్రజల కోసం పనులు చేస్తూ వాళ్ళ ఓట్లు ద్వారా అధికారాన్ని పొందటానికి బదులుగా, ఏకంగా ఎంఎల్‌ఎలనే కొనేసి, ఆయా ప్రభుత్వాలను కూల్చి, ఒక్కో రాష్ట్రాన్ని దురాక్రమిస్తున్నది మోడీ బిజెపి! ఇంకా “ఇడి, ఐటి, సిబిఐ త్రిశూలంతో వరుస దాడులు చేస్తూ బిజెపియేతర పార్టీలను, ప్రజా ప్రతినిధులను భయభ్రాంతుల్ని చేస్తున్నది మోడీ ప్రభుత్వం! రివర్స్ గేర్‌లో బోగీలను వెనక్కు నెట్టేసే రైలింజన్‌లా దేశాన్ని వేగంగా వెనక్కు నెట్టేస్తున్నా సరే మోడీని అదేమిటని కనీసం అడిగేందుకు కూడా హడలిపోతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు! తాత్కారణంగా దిక్కు తోచక, నిరాశ, నిస్పృహల కారు చీకట్లలో బిక్కుబిక్కు మంటున్న భారతీయులకు, బిజెపిని ప్రత్యామ్నాయ విధానాలతో ఉదా॥ ‘మోడీజీ నీది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజెషన్’ అంటూ మోడీని సవాలు చేస్తున్న కెసిఆర్ ఆశాజ్యోతిగా బిఆర్‌ఎస్ భారత దేశానికే భానోదయంగా అగుపించటమే గాదు, కొండంత భరోసాను కల్పిస్తున్నారు.

BRS slogans in Ind vs Pakistan match

అందుకే ఎపినే కాదు కార్యసాధకుడైన కెసిఆర్‌ను నేడు దేశమంతా స్వాగతిస్తున్నది. ఎందుకంటే మోడీలా మాటల మాంత్రికుడు కాదు, చెప్పింది చేసి చూపే కార్య సాధకుడు కెసిఆర్. తాను దేశానికేం చేయబోతున్నాడో, దాన్నీపాటికే తెలంగాణలో చేసి మరీ తనను రుజువు చేసుకున్నారు. దటీజ్ కెసిఆర్. అయినా సరే ఇంత స్వల్ప వ్యవధిలో దేశమంతటా ఆయనెలా విస్తరించగలడు లెమ్మని చప్పరిస్తున్న వాళ్ళంతా తెల్సుకోవాల్సిన సత్యమొకటుంది! అదేమిటంటే? 1) ధర్మం కోసం పోరాడే పార్థునకు, కృష్ణ పరమాత్మ చేదోడులా సత్సంకల్పంతో పరిశ్రమించే వానికి దైవ సహాయం తప్పక లభిస్తుంది!” ఇది ‘గీతా ప్రబోధ సత్యం’! 2.“ఒక వ్యక్తి, దేశం తన కోసం ఎదురు చేసేంత స్థాయికి ఎదిగితే చాలు, ఇక ఆ వ్యక్తి తన ప్రగతికి తోడ్పడేందుకు కావలసిన సరంజామాను దేశమే సమకూర్చుకొంటుంది” అన్నాడు ప్లేటో! ఇది చారిత్రక సత్యం! మరి ఆ స్థాయికెదిగిన కెసిఆర్‌కు అవసరమైన వాటిని ప్రజలే అప్పటికే సమకూర్చుకుంటారు.సందేహమే లేదు! ఇప్పటి నుండే ఆయనను స్వాగతిస్తూ, ఆయనతో కలిసి నడుస్తామంటూ దేశం నలుమూలల నుండి పలువురు ఆత్రుతగా ముందు కొస్తుండటమే అందుకు నిదర్శనం!
ఇక ఎపిలో పరిస్థితిని చూద్దాం! అక్కడ ముఖ్యంగా గ్రామీణ రైతాంగం కూలీలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలలో బిజెపి పట్ల వ్యతిరేకత తీవ్రంగా వుంది.

కాని వామపక్ష పార్టీలు తప్ప, ప్రతిపక్ష జనసేన, టిడిపి, అధికార వైసిపితో సహా భయంతోనే రావచ్చు మోడీకి సలాం చేస్తున్నయ్! అందుకే వాళ్ళలో ఎవరికి ఓటేస్తే ఏ ముంది? పళ్ళూడగొట్టుకోడానికి ఏరాయైతే నేం? అనుకుంటున్నారు ఎపి ప్రజలు! అగ్ర కులాల వారు అటూ, ఇటూ చూస్తున్నా, అణగారిన వర్గాలు, మైనారిటీలో అత్యధికులు మాత్రం బిజెపికి ప్రత్యామ్నాయమే లేనప్పుడు వైసిపిని విడనాడటం కాసిని పాలిచ్చే గేదెను పోగొట్టుకోటమే ననుకుంటున్నారు!
తాత్కారణంగానే పై పార్టీలలోని అణగారిన వర్గాల వారు నేడు బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రత్యక్షమైన బిఆర్‌ఎస్‌ను ఉషోదయంగా, కెసిఆర్‌ను ఆశాజ్యోతిగా భావిస్తున్నారు. అందువల్లనే తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ వంటి ప్రముఖులతో ఎపిలో బిఆర్‌ఎస్ ఆవిర్భావాన్ని శుభ సూచకమనీ గతంలో ఎత్తుగడల పేరిట కొన్ని పొరపాట్లు చేసినా ప్రస్తుత కీలక దశలో ‘బిఆర్‌ఎస్’తో కలిసి వామపక్షాలు కూడా బిజెపిపై పోరాడేందుకు సంసిద్ధం కావటాన్ని బిఆర్‌ఎస్‌కు విజయ సూచికమనీ అంటున్నారు విశ్లేషకులు!
బిఆర్‌ఎస్‌కు ఎపిలో మరొక ఆశాజనకమైన అంశమేమంటే, రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఓటర్లున్న బలమైన బిసి సామాజిక వర్గం యాదవులు! ఎన్‌టిఆర్ హయాంలో టిడిపిలో వీరికి మంచి ప్రాముఖ్యత లభించింది.

ఇప్పుడు మళ్ళీ ఎన్‌టిఆర్ పట్ల వీరాభిమానంతో తన కుమారునకు ‘తారక రామారావు’ అన్న ఆయన పేరునే పెట్టుకున్న కెసిఆర్ బిఆర్‌ఎస్‌లోనూ తమకు మంచి గుర్తింపు లభిస్తుందన్న ఆశాభావంతో వున్నారు యాదవులు. కావున ఆ దిశగా కృషిని ప్రారంభిస్తే ఎపిలో బిఆర్‌ఎస్‌కు సదరు సామాజిక వర్గం బలమైన పునాది కాగలదంటున్నారు విశ్లేషకులు! ఇలాగే నేడు ఆసేతు హిమాచల పర్యంతం బిజెపియేతర పార్టీలు, నేతలు బిఆర్‌ఎస్‌తో చేయి, చేయి కలిసి నడిచేందుకు సంసిద్ధులవుతున్నారు. అలాగే దేశ ప్రగతి సాధనా సత్సంకల్పంతో పరిశ్రమిస్తున్న సిఎం కల్వకుంట్ల చంద్ర శేఖరునకు దైవ సహాయం కూడా తప్పక తోడవుతుంది.

పాతూరి వేంకటేశ్వరరావు
9849081889

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News