కీసరః ముఖ్యమంత్రి కెసిఆర్ భగవంతుడి స్వరూపమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం చీర్యాల్‌లోని ఎంఎల్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో కీసర మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న సిఎం కెసిఆర్‌పై విశ్వాసం ఉంచిన పేదలు దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, నేడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు కండ్ల ముందే ఉన్నాయని తెలిపారు.
ఆసరా పింఛన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా జరుగుతుందని, దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడా లేవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా వినియోగించే దమ్మున్న నాయకుడు లేడని, దేశ ప్రజల కెసిఆర్‌పై బరోసాతో ఉన్నారని చెప్పారు. కెసిఆర్ ప్రధాని కావడం ఖాయమని మల్లారెడ్డి అన్నారు.టిపిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుండి ఎంపిగా గెలుపొంది ఇక్కడి ప్రజలకు ముఖం చాటేశాడని, ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పార్టీ కుటుంబం లాంటిదని చిన్న పాటి సమస్యలను భూతద్దంలో చూడవద్దని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాలు, సొంత స్థలం ఉండి ఇళ్లులేని వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందించే బాధ్యత తనదని మంత్రి భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో గతంలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. సేవ చేయడం తనకు ప్యాషన్ అని, ఇక్కడి ప్రజలకు వాచ్‌మెన్‌లా పనిచేస్తానని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల మాయ మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే, అభివృద్దిని కాంక్షించే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సోదరభావంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందకు వెళ్లాలని అన్నారు. బిఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేకర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తెలంగాణలో ఇంటింటికి ఒక కథలా చెప్పుకోవచ్చని అన్నారు.
బిజెపి నేతలు మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు చామకూర భద్రారెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎం.ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.నారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.