Monday, January 20, 2025

లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం

- Advertisement -
- Advertisement -

ఈ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ తప్పదు
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌స్వేచ్ఛ ప్రమాదంలో పడింది
70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకింది

మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని, ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాలను ఆ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్ ఉండదని త్వరలోనే ఆ పార్టీ విఆర్‌ఎస్ తీసుకుంటుందన్నారు. అదేవిధంగా బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, ఆర్థిక విధానాల్లోనూ మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. బషీర్‌బాగ్‌లో శుక్రవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బిజెపిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఎంపిలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని, పార్లమెంట్‌లో విపక్ష ఎంపిలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు, ఛార్జీషీట్, విచారణ లేకుండానే విపక్ష నేతలను జైల్లో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికే పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్ స్వేచ్ఛ ప్రమాదంలో పడింది కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలనే కాకుండా మీడియా సంస్థలను కూడా బెదిరించిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే ఈడీ, సిబిఐ, ఇన్‌కంట్యాక్స్ సంస్థలను పంపించి బెదిరించారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి పరిస్థితి ఎలా ఉందో వివరించారన్నారు.

ఆర్థిక విధానాల్లోనూ మోడీ విఫలం

ఆర్థిక విధానాల్లోనూ మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకిందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్‌ఎస్ పాలనలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచారన్నారు. కేంద్రంలో రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగుచట్టాలు తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. బిజెపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య విషయంలో ఖూనీ జరుగుతుందన్నారు. మరోసారి మోడీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా మాదిరిగా మన దేశం తయారవుతుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపైనే ఈడీ, సిబిఐ దాడులు జరిపి, భయపెడుతుంటే ఇక సామాన్యుల సంగతి ఏమిటో మీరే ఆలోచన చేయాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

సాగు చట్టాలను బిజెపి రద్దు చేసింది

కొన్ని నెలల పాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక, సాగు చట్టాలను బిజెపి రద్దు చేసిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అగ్నివీర్ పథకం దేశ రక్షణకు ప్రమాదకరమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. దేశంలో కాషాయ పార్టీ పాలన మొదలయ్యాకే చైనా వంటి దేశాలు కొంతమేర ఇండియా భూభాగాన్ని ఆక్రమించాయని ఆయన ఆరోపించారు. గతంలో ఏ ప్రధాని కూడా మోడీలా దిగజారి మాట్లాడలేదని ఆయన దుయ్యబట్టారు. పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. మోడీ మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో కూడా వివరించటం లేదన్నారు. కమలం పార్టీ నేతలకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. ఈసారి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అత్యధికంగా ఎంపిలను సస్పెండ్ చేసింది బిజెపినే

పార్లమెంట్ వ్యవస్థను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపిలను సస్పెండ్ చేసింది బిజెపి ప్రభుత్వమని ఆయన ఫైర్ అయ్యారు. బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయలేదని ఆయన విమర్శించారు. మరోసారి బిజెపి వస్తే పార్లమెంటరీ డెమక్రసీ ఉండదని ఆయన తెలిపారు. మోడీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

కెసిఆర్ జనాలకు క్షమాపణ చెప్పాలి

కాళేశ్వరం విషయం లో జరిగిన తప్పులకు కెసిఆర్ జనాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ల విషయంలో నిపుణుల ఆలోచన మేరకు తాము ముందుకు వెళతామన్నారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ శాఖను కెసిఆర్ ఖతం చేశారన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను సరైన పద్ధతిలో కట్టడం లేదన్నారు. తమ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వమని, మా ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటామని, ఎవరూ తమ ప్రభుత్వాన్ని కూల్చలేరన్నారు. కెసిఆర్ నేర్పిన విద్యను అందరూ నేర్చుకున్నామన్నారు. బిజెపి వాళ్లు ఇప్పటికే చాలా ప్రభుత్వాలు కూల్చారని ఆయన ఆరోపించారు. కానీ, తెలంగాణలో బిజెపి వాళ్ల ఆటలు ఇక్కడ సాగవన్నారు. బిఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండడం లేదని, ఇప్పటికే వందలు, వేల మంది తమ పార్టీలో జాయిన్ అయ్యారన్నారు. ఎన్నికల తరువాత ఏమీ జరుగుతుందో అందరూ చూస్తారని ఆయన అన్నారు. క్రికెట్ టీం మాదిరిగా తాము పటిష్టంగా ఉన్నామని, ఇండియా కూటమి గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మంత్రి ఉత్తమ్ జోస్య చెప్పారు.

5 లక్షల మెజార్టీతో నల్గొండలో గెలుస్తాం

5 లక్షల మెజార్టీతో నల్గొండలో గెలుస్తామని, భువనగిరిలో కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఆర్థిక వనరులను పెంచడం కోసం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తనతో కలిసి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల కోడ్ తరువాత ఆర్థిక వనరుల సమకూర్పుపై ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామన్నారు. జర్నలిస్ట్‌లకు వెల్ఫేర్, ఇళ్ల స్థలాలు, సెక్యూరిటీ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిది ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News