హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తామని తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేస్తోందన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే బిఆర్ఎస్ నినాదంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. దేశ పరివర్తన కోసమే బిఆర్ఎస్ అని సిఎం చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సిందే ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదని కెసిఆర్ తేల్చిచెప్పారు.
దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమన్నారు. కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి కావాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో కొత్త పర్యావరణ విధానం కావాలన్నారు. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం అవసరమని తెలిపారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవన్నారు. తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వ సాధారణం.. అవహేళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించామన్నారు. కర్నాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగువాళ్ల కోసం బిఆర్ఎస్ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.