మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మినీప్లినరీలు జరిగాయి. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తూ.. నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల సభలు నిర్వహిచాంచారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బిఆర్‌ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. జై తెలంగాణ, జై భారత్, జై కెసిఆర్ నినాదాలతో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా మారుమోగాయి. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రతినిధుల సభలో పాల్గొని ప్రసంగించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో జనంలోకి వెళ్లిన బిఆర్‌ఎస్.. ఊరూరా జెండా పండుగలు నిర్వహించింది.
ఈనెల 27న బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభ పేరుతో మినీ ప్లీనరీలు నేతలు చేపట్టింది ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి..? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేశారు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ తీసుకువచ్చిన ధీరోదాత్తుడు కెసిఆర్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని పేర్కొన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు.
చరిత్రలు సృష్టించడం కెసిఆర్‌కు కొత్తకాదు : హరీశ్
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మంత్రి హరీశ్ రావు అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కెసిఆర్‌కు కొత్తకాదని వెల్లడించారు. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్రమంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశారని వెల్లడించారు. బిఆర్‌ఎస్ ఏర్పాటు మరో చరిత్ర కాబోతున్నదని తెలిపారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వద్ద బిఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లినరీలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్రం వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నేడు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం సిఎం కెసిఆర్ పడిన శ్రమ అని అన్నారు. తెలంగాణలో ఆకుపచ్చ చరిత్ర రాశారని, దీనికి ప్రదానం కాళేశ్వరమని చెప్పారు. ఉద్యమ జ్వాల కెసిఆర్ నేడు అభివృద్ధి జ్వాలగా మారారని తెలిపారు.
జిల్లాల్లో జరిగిన సమావేశాల్లో
పాల్గొన్న మంత్రులు, ఎంఎల్‌ఎలు
పాలకుర్తిలో జరిగిన ప్రతినిధుల సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశలో దేశంలోనే అభివద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జెండా ఎగర వేశారు. ఖమ్మంలో జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన సభలో జిల్లా పార్టీ ఇంఛార్జ్ దాసోజు శ్రవణ్, నిజామాబాద్ జిల్లా గ్రామీణ నియోజకవర్గం భూమా రెడ్డి ఫంక్షన్ హాలులో ఆర్మూర్ నియోజకవర్గం ఎస్‌ఎస్‌కె ఫంక్షన్ హాలులో ప్రజాప్రతినిధుల సమావేశాలు జరిగాయి. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి లలిత గార్డెన్‌లో జరిగిన బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సభకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఇంఛార్జ్ బండ ప్రకాష్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌టిజి చైర్మన్, ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, పియుసి చైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్‌రెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, వనపర్తి లక్ష్మీప్రసన్నగార్డెన్‌లో జరిగిన బిఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.