Thursday, January 23, 2025

అభివృద్ధే అసలు అజెండా

- Advertisement -
- Advertisement -

అదే బిఆర్‌ఎస్ జాతీయ నినాదం
ఇతర పార్టీలకూ బిఆర్‌ఎస్‌కూ తేడా అదే.. 
అందుకే బిఆర్‌ఎస్ వైపు అందరి చూపు

ఒకరిని గద్దె దించడం, ఇంకొకరిని గద్దెనెక్కించడం అనే సింగిల్ పాయింట్ అజెండాతోనే రాజకీయాలు చేస్తున్న ఉత్తరాది పార్టీల ఆలోచనలకు భిన్నంగా బిఆర్‌ఎస్ ‘అభివృద్ధి అజెండాగా పార్టీల విధివిధానాలు ఉండాలి’ అనే నినాదంపై ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్ సిఎం నితీష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను బేరీజు వేసుకొంటూ రాజకీయ పరమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ సరికొత్త చర్చకు తెరలేపింది. దేశం సర్వతో ముఖాభివృద్ధిని సాధించే విధంగా రాజకీయాలు ఉండాలని, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాలు ఆ విధంగా ఉండాలని కొత్త ఆలోచనకూ, సరికొత్త చర్చకూ బిఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం పునాదులు వేసింది. ఒకరిని గద్దె దించడం, ఇంకొకరిని గద్దెనెక్కించడం అనే సింగిల్ పాయింట్ అజెండాతోనే రాజకీయాలు చేస్తున్న ఉత్తరాది పార్టీల ఆలోచనలకు భిన్నంగా బిఆర్‌ఎస్ పార్టీ ‘అభివృద్ధి ఎజెండాగా పార్టీల విధివిధానాలు ఉండాలి’ అనే నినాదంపై ఇప్పుడు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, చివరకు అధికారంలో ఉన్న పార్టీల్లో సై తం హాట్ టాపిక్‌గా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు చే సిన వ్యాఖ్యలను బేరీజు వేసుకొంటూ రాజకీయ పరమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ప్రధాని మోడీని గద్దె దించాలని, అందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని ఇటీవల పిలుపునిచ్చారు. అందుకు మెజారిటీ పార్టీల మద్దతు కూడా లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు, పన్నుల విధానాలు, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటిన వైనం, పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్థాయిలో పెరగడంతో దేశ ప్రజల జీవన ప్రమాణా లు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా ఆకాశమే హద్దుగా పెరిగిన అవినీతి, కుంభకోణాలతో బిజెపి గ్రాఫ్ విపరీతం గా పడిపోయిందని, అందుకు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయని విపక్షాలన్నీ గంపెడాశలు పెట్టుకున్నాయి. అందుకే బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పిలుపుకు మెజారిటీ ప్రతిపక్షపార్టీలు సానుకూలంగా స్పందించాయని పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అమెరికా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకొన్న వెంటనే మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని, అన్ని రకాల సంక్షోభాలకు ప్రధాని మోడీనే బాధ్యుడని ధ్వజమెత్తుతూనే పదవి నుంచి నరేంద్రమోడీని గద్దెదించడమే ప్రధాన ఎజెండాగా ఉండకూడదని, ఒక వ్యక్తిని గద్దె దించడమే ఎజెండాగా ఉండకూదని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధానాలు, సిద్దాంతాలు ఎజెండాగా ఉండాలని, అలాంటి ఎజెండాతో ప్రతిపక్ష పార్టీలు ఏకంకావాలేగానీ వ్యక్తులకు వ్యతిరేకంగా పార్టీలు ఏకం కావాలనే నినాదం, అలాంటి విధానం… రెండూ కరెక్టు కాదని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చకు దారితీశాయి.
బిఆర్‌ఎస్ పార్టీకి అధికారం ఇస్తే దేశాన్ని తెలంగాణ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఆర్ధిక విధానాలు, పాలనాపరమైన సంస్కరణలన్నీ దేశంలో అమలు చేస్తే కేవలం అయిదేళ్ళల్లోనే అనేక అద్భుతాలు సృష్టించవచ్చునని, అందుకు తెలంగాణలో చేసి చూపించామని, సత్పలితాలు సాధించామనే అంశాలను దేశప్రజలకు తెలియజేస్తూ చైతన్యవంతులను చేయాల్సి ఉందని, అందుచేతనే బిఆర్‌ఎస్ పార్టీ విధానాలకు మద్దతు పలుకుతూ నరేంద్రమోడీని, బిజెపిని గద్దెదించడానికి కలిసి రావాలని కెటిఆర్ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఎజెండాకు, బిఆర్‌ఎస్ పార్టీ ఎజెండాకు చాలా తేడా ఉందని, దేశ ప్రజలకు కావాల్సింది ప్రధానిగా ఎవ్వరుండాలనేది కాదని, అభివృద్ధి ఎవ్వరు చేస్తారు.? అనే దానిపైనే ప్రజలు ఆలోచన చేస్తున్నారని, ఆ దిశగా రాజకీయాలు చేయాల్సి ఉందని కెటిఆర్ కోరిన విధానం సీనియర్ రాజకీయ నాయకులను కూడా విశేషంగా ఆలోచింపజేసిందని విశ్లేషకులు వివరించారు. అంతేగాక రానున్న సార్వత్రిక ఎన్నికలు, డిసెంబర్‌లో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జాతీయ పార్టీలు కూడా తమ విధానాలను మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి-సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాలు, ఆర్ధిక విధానాలు, పరిపాలనా సంస్కరణలు దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచాయని, తెలంగాణ ప్రజల్లో ఉన్న సానుకూలమైన అభిమానాన్ని సొమ్ముచేసుకోవడానికి జాతీయ పార్టీలు ఒక మెట్టుదిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24/7 నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం, దళితబంధుతో షెడ్యూల్డు కులాలను ఆదుకోవడం, బిసీల కులవృత్తుల వారికి కూడా ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసే పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టను పెంచడమే కాకుండా తెలంగాణ మోడల్ పథకాలను తమతమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై వత్తిళ్ళు పెరగడం, అంతేగాక రైతుబంధు పథకానికి ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ వంటి ప్రముఖులు కూడా కీర్తించడం, మహారాష్ట్రలోని రైతు సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా పర్యటించి వ్యవసాయ పథకాలు అమలవుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకొని కీర్తించిన అంశాలు ఇప్పుడు జాతీయస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ పథకాలే జాతీయ రాజకీయాలను కూడా ఒక మలుపు తిప్పుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాలకు తోడు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు (అభివృద్ధి-సంక్షేమం ఎజెండాగా రాజకీయాలు జరగాలి) కూడా ఇప్పుడు జత కలవడంతో రానున్న ఎన్నికల్లో ఈ నినాదమే ప్రధాన ఎజెండాగా మారవచ్చునని వారంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News