Monday, December 23, 2024

ఎపిలో అంతటా పోటీ చేస్తాం: తోట చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్ పార్టీ పోటీ చేయబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణ డెవలప్‌మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, ఆ మోడల్‌ను ఎపిలోనూ అమలు చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వలన ఎపికి ఎంతో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఎపికి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టకమన్నారు. పోలవరం నిర్మాణంలోనూ కేంద్రం సహకారం రావడం లేదన్నారు. ప్రతిపక్ష పోషించాల్సిన కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, బిజెపిని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన చెప్పారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో కెసిఆర్ ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. బుధవారం విజయవాడలో దివంగత ఎంఎల్‌ఎ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గుంటూరు జిల్లా ఉండవల్లి దేవుడి మాన్యంలో జరిగిన మాహా మృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజలో తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎపిలోనూ ఎన్నో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఎపిలోని దుగ్గురాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, విశాఖ నగరాల్లో ఇప్పటి వరకు మెట్రో రైలు సౌకర్యం లేదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుందని ఆయన ఆరోపించారు.

ఈ సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్ళు లేరని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా తాగునీరు, సాగునీటి సమస్యలు, ఉపాధి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికి అనేక మారుమూల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజల దృష్టిని కేంద్ర పాలకులు మరల్చితున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై బిజెపి సర్కార్‌కు పట్టులేదని విమర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు రూ. వెయ్యి కోట్ల ఆఫర్‌ను బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి దుష్ప్రచారం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీలు, నేతల వ్యక్తిత్వాలపై అవహేళన చేసే అభియోగాలు మోపడం కూడదని ఆయన సూచించారు. జనసేనతో పొత్తు కోసం కెసిఆర్ డబ్బులను ఆఫర్ చేశారని అభియోగం మోపడం వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News