Sunday, January 19, 2025

హ్యాట్రిక్ కొడతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీదే అధికారమని, హ్యాట్రిక్ కొడతామని మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మేరకు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ తెలంగాణ రాష్టానికి సిఎం కెసిఆర్ అవుతారన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడిగింపుపై ఆలోచిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. మెట్రో రైలును ఎల్బీనగర్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, ఎల్బీ నగర్, నాగోల్ నుండి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలని ఎంఎల్‌సి యెగ్గే మల్లేశం అడిగారు.

దానికి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్లు ఉందని, గత మెట్రో మొత్తం పిపిపి తో నడిచిందని తెలిపారు. ఇక ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అన్నారు. చాలా మంది కరోనా తర్వాత రవాణా కష్టాలు పడ్డారని, ఎయిర్‌పోర్టు మెట్రోలో ఎవరైనా ప్రయాణం చేయొచ్చన్నారు. లక్డికపూల్ నుంచి బిహెచ్‌ఇఎల్ వరకు మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడతామని, ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు. కేంద్రం కనీసం తెలంగాణపై కనికరం చూపెట్టడం లేదని మండిపడ్డారు.

‘కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుంది’

రాష్ట్రంపై కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కానీ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిహెచ్‌ఇఎల్ నుండి లక్డీకపూల్ వరకు 24 కి.మీ , నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణ పనుల కోసం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కూడా కేంద్రం నుండి స్పందన లేదన్నారు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్ మాసంలోనే కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ ను సమర్పించినట్టుగా చెప్పారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు కోరామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకుగాను అపాయింట్‌మెంట్ కోరితే స్పందించడం లేదన్నారు. అయినా కూడా మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలోని అధికారులను కలిసి నిధుల కోసం వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

బెంగుళూరు మెట్రో రెండో దశ రూ. 59 వేల కోట్లతో ప్రారంభించ నున్నారన్నారు. ఈ నిధుల్లో 20 శాతం ఈక్విటీ రూపంలో , మరో 21 శాతం సావరీన్ గ్యారంటీ రూపంలో కేంద్రం అందిస్తుందని చెప్పారు. చెన్నైలో కూడ మెట్రో రెండో ఫేజ్ రూ. 16 వేల కోట్లు , సావరీన్ గ్యారంటీ కింద రూ. 42 వేల కోట్లు కేంద్రం అందిస్తుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, వారణాసి, గోరఖ్ పూర్ , ఆగ్రా, కాన్పూర్, ఆలహబాద్ లలోని మెట్రో ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గుజరాత్ గాంధీనగర్ లో మెట్రోకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని మండలిలో గుర్తు చేశారు. కానీ హైద్రాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా తాము హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ నిర్మాణాన్ని ఆపడం లేదని స్పష్టం చేశారు.

‘అక్రమాలకు తావులేకుండా భవన నిర్మాణ అనుమతులు’

రాష్ట్రంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో అనుమతులు రానట్లయితే ఆటోమేటిక్‌గా అనుమతి ఇచ్చినట్లేనని వెల్లడించారు. భవన నిర్మాణ క్రమబద్ధీకరణపై కోర్టు కేసు ఉందని అది పరిష్కారం కాగానే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఈ పద్ధతిలో లోపాలు ఉంటే సరిదిద్దుతామని చెప్పారు. ఒకవేళ నిర్ణీత గడువులో అనుమతులు రానట్లయితే ఆటోమేటిక్‌గా అనుమతి ఇచ్చినట్లేనని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను టిఎస్ బిపాస్‌కు అనుగుణంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

2015-16లోనే జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 తీసుకొచ్చి ఉచితంగా, కనీస ఛార్జీలతో క్రమబద్ధీకరించామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు లక్ష పైచిలుకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. శాసన మండలి సభ్యుల కోరిక మేరకు రాష్ట్రంలో గతేడాది 2022లో కూడా క్రమబద్ధీకరించుకోవడానికి ఈ జీవోల ద్వారా అవకాశం కల్పించామన్నారు. గృహ నిర్మాణ శాఖ రద్దు చేసుకున్నామని, ఇకపై రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వివరించారు. 84 గ్రామాల తీర్మానం చేసి 111 జీవోను తొలగించి 69 జీవో తెచ్చామన్నారు. 1920లో కట్టిన హిమాయత్‌సాగర్ కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News