Monday, December 23, 2024

బిజెపికి ప్రజల తిరస్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, దీంతో
మరోసారి ఆ పార్టీ తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. సెస్ ఎన్నికలలో అడ్డదారిన గెలిచేందుకు బిజెపి సాధారణ ఎన్నికల మాదిరి అన్ని ప్రయత్నలని చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ ఆ పార్టీ కుటిల ప్రయత్నాలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా కాషాయ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు.విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రైవేటికరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బిజెపి విద్యుత్ సంస్కరణల పేరిట చేస్తున్న కుట్రలపై సాధారణ ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉన్నదన్న విషయం తేటతెల్లమైందన్నారు. అందుకే సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించినట్లు కెటిఆర్ అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ సెస్‌కు ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావించారన్నారు. అందుకే ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని కెటిఆర్ అన్నారు.
ఈ సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి భారీ ఎత్తున డబ్బులు వెదజల్లిందని కెటిఆర్ ఆరోపించారు. సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. అనేక ప్రలోభాలకు తెరలేపినా, ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల బిజెపి ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బిజెపి పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బిజెపికి స్థానం లేదని, ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఎన్నికల్లో బిజెపిని తిరస్కరిస్తూ వస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సెస్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సిఎం కెసిఆర్ నాయకత్వంపైన తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని కెటిఆర్ అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలకు వారిచ్చిన జనామోదమని అన్నారు. ఈ ఎన్నికల విజయంతో బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం పైన, ప్రభుత్వం పైన మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా,మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు పైన దృష్టి పెడతామని కెటిఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి అనే అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు.
ఒకవైపు రైతులు, కుల వృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు, ఇస్తూ మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. అలాగే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు బలపరిచారని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

హర్షం వ్యక్తం చేసినబోయినపల్లి వినోద్
సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం పట్ల్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను పట్టం కట్టిన ఓటర్ల అభిమతానికి అనుగుణంగా.. బాధ్యతతో సెస్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఓటర్లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినోద్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా… ఓటర్లు మాత్రం పార్టీ అభ్యర్థులకు అండగా నిలవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల నుంచి సంపూర్ణ సహకారాన్ని తీసుకుని సెస్‌ను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బాధ్యతను మరింత పెంచిన ఓటర్ మహాశయుల ఆశయాలకు అనుగుణంగా సెస్ ను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామని వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News