Tuesday, November 5, 2024

సై అంటే సై

- Advertisement -
- Advertisement -

 

  •  ఈవో నిర్వాహకంతో బీఆర్‌ఎస్ పార్టీలో చిచ్చు
  • సవాల్‌కు ప్రతి సవాల్ అంటున్న ఇరువర్గాలు
  • ఎమ్మెల్యే భర్త అవినీతిపరుడంటూ స్వంత పార్టీ నేతల ఆరోపణ
  • భూ ఆక్రమణలు, అక్రమాలు చేశాడని నిరూపిస్తాం
  • ఏడుపాయల అమ్మవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తాం… బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు
  • ఆరోపణలు నిజం కావు… ఈవో తప్పులో నాకు సంబంధం లేదు
  • ఉద్దేశపూర్వకంగా మా ప్రతిష్ఠకు బంగం కలిగిస్తున్నారు
  • అమ్మవారిపై ప్రమాణానికి సవాల్ స్వీకరిస్తున్నా… ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి

మెదక్ ప్రతినిధి: ఏడుపాయల అమ్మవారి బంగారాన్ని తన ఇంటికి తరలించుకుపోయిన ఈవో సార శ్రీనివాస్ వ్యవహారం రోజురోజుకు రాజుకుంటుంది. ఈ విషయమై తనకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక శాసనసభ్యురాలు భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. అందుకు స్పందించిన సొంత పార్టీ నేతలు అక్రమాలను బయటపెడతామంటూ ప్రతి సవాల్ విసిరారు. దీనికి దేవేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించి అమ్మవారి వద్ద ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నామని ఇరువర్గాలు స్పష్టం చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దైవేందర్‌రెడ్డి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలియజేస్తూ ఎవరైనా నిరూపిస్తే తడి బట్టలతో ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసురడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తన స్వంత పార్టీ నేతలే బుధవారం మీడియా ముందుకు వచ్చి దేవేందర్‌రెడ్డి అక్రమాలకు పాల్పడింది వాస్తవమేనంటూ తాము కూడా అమ్మవారి పాదాల వద్ద ప్రమాణం చేసేందుకు సిద్దమేనని ప్రతి సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మేన్ గంగ నరేందర్, న్యాయవాది జీవన్‌రావు, రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు మాట్లాడుతూ… దేవేందర్‌రేడ్డి ఇప్పటివరకు ఎన్నో అక్రమాలకు పాల్పడడంతో పాటు అక్రమంగా ఎన్నో భూములను స్వాహా చేశాడని ఆరోపించారు. 2014లో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మాదేవేందర్‌రెడ్డి శాసనసభ ఉపసభాపతిగా పనిచేశారు. ఆ సమయంలో దేవేందర్‌రెడ్డి తన అధికార దుర్వినియోగాలకు పాల్పడుతూ తెలంగాణ ఉధ్యమ కారులను అనచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మెదక్ మున్సిపల్ చైర్మేన్ పదవిని అప్పట్లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి విఫలం కాగా గత్యంత్రం లేక బిసీ ఉధ్యమకారుడు మల్లికార్జున్‌గౌడ్‌కు ఇవ్వక తప్పలేదని వారన్నారు. గతంలో అద్దె ఉంట్లో ఉన్న దేవేందర్‌రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నశంకరంపేట మండలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాల పేరుతో తన భావమరిది రాజిరెడ్డి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌లో అడ్డగోలుగా అమ్ముకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఏడుపాయలలో నిర్మిస్తున్న దుకాణాలు కేటాయిస్తామని ఆశ చూపి ఎనిమిది మంది వద్ద 3 నుండి 4 లక్షల రూపాయాలు వసూలు చేసి రషీదు కూడా ఇవ్వకపోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు.

తన స్వంత ఊరు అయిన కొనాపూర్‌లోని సోసైటీలో 2.5 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగంతో చైర్మేన్ పదవి నుండి తొలగిస్తే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న విషయం వాస్తవం కాదా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవేందర్‌రెడ్డి అక్రమాల చిట్టాకు అంతులేదని ఇలాంటి వ్యక్తిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లు రాజాసింగ్, యాదవరావు, గోపాల్‌నాయక్, బిక్షపతి, మాజీ సర్పంచ్ మనోజ్, సిద్దిరాములు, బీఆర్‌ఎస్ నాయకులు తదీతరులు పాల్గొన్నారు.

సవాల్ స్వీకరిస్తున్నా: ఇఫ్కో డైరెక్టర్ యం. దేవేందర్‌రెడ్డి

రాజకీయంగా ఎదుర్కోలేక తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఇఫ్కో డైరెక్టర్ యం. దేవేందర్‌రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్ అధికా రంలోకి వచ్చాక ఏడుపాయల పుణ్యక్షేత్రం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడితే తనకేమి సంబంధమని ప్రశ్నించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా తమ ప్రతిష్ఠకు బంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే సంబంధిత శాఖ తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని, తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ఏడుపాయల వనదుర్గాభవాని మాత ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్దమని, నేడు గురువారం నాడు ఉదయం 8 గంటలకు ఆలయానికి వస్తానని ప్రతి సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News