Saturday, January 4, 2025

నల్లగొండ నుండే గులాబీ శంఖారావం!

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రచారం మొదలు పెట్టి కలిసొచ్చిన ప్రాంతం ఇంద్రవెల్లి.. అక్కడ నుండే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. అయితే గులాబీ పార్టీ మాత్రం రైతుల సెంటిమెంట్‌ను వాడుకొని పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నగారాను తొలిసారి దక్షిణ తెలంగాణలోని నల్లగొండ గడ్డ నుండి పూరించేందుకు సిద్ధమవుతోంది. అందుకు గులాబీ దళపతి కెసిఆర్ వ్యూహాత్మక ప్లాన్‌తో ముందుకుపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తుంటిఎముక సర్జరీ తర్వాత ఇటీవల ఆయన శాసనసభ్యునిగా ప్రమాణం స్వీకారం చేశారు. తొలిసారి తెలంగాణ భవన్‌లో ముఖ్యనేతలతో మంగళవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో నల్లగొండ నుండే లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవారం రోజుల్లో నల్లగొండ వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇందుకు అనుగుణంగా అక్కడ నుండే ప్లాన్ చేసి పంపనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే నల్లగొండ నుండే ఎన్నికల శంఖారావం పూరించడానికి కృష్ణా నదీ జలాల పంపిణీని ప్రధాన ఎజెండా తీసుకొని రైతుల్లోకి తీసుకుపోయే ప్ల్లాన్‌తో ముందుకుపోతున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నదీ జలాల నిర్వహణ బాధ్యతలు కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డు (కెఆర్‌ఎంబి)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి విడుదల కేంద్రం చేతిలోకి వెళితే.. సాగర్, ఎఎంఆర్‌పి పరిధిలోని ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనుంది. దీనిపై రైతుల పక్షాన పోరాటం చేసినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతో నల్లగొండ వేదికగా సభకు ప్ల్లాన్ చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే సాగర్, శ్రీశైలం జలాశయంలో కలిపి 811 టిఎంసిల నీటిని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వినియోగించుకోవాలి.అయితే 511 టిఎంసిలు ఆంధ్రకు.. 299 టిఎంసిలు తెలంగాణకు అప్పగిస్తూ కెఆర్‌ఎంబి నిర్ణయం తీసుకుంది. కానీ కృష్ణానది తెలంగాణలో 68 శాతం ఉంటే నీటి పంపిణీలో తక్కువ ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వీటి ఆధారంగా ఇక్కడ నుండే పోరుబాట మొదలుపెట్టి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించాలనే యోచనలో మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కెసిఆర్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కృష్ణానదీ జలాల వినియోగంలో జరుగుతున్న తీరును రైతులకు వివరించి లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంలో గులాబీ శ్రేణులు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11/12 స్థానాల్లో ఓటమిపాలై శ్రేణులు డీలాపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు సంసిద్ధం చేసే విధంగా వారిలో జోష్ నింపే ప్రయత్నంతో ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నప్పుడే కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డు ఒప్పందానికి సంతకాలు చేసి, ఇప్పుడు రైతుల్లో లబ్ధి పొందేందుకు నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు జరిగిన ఒప్పందాలు కావని, అసెంబ్లీ వేదికగా బిఆర్‌ఎస్ నిర్ణయాలను బయటపెడతామని అంటున్నారు. ఏదేమైనా నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన ఉద్యమంలో కొట్లాడిన అప్పటి బిఆర్‌ఎస్.. ఇప్పుడు నీటి వినియోగంలో అసమానతలు.. నీటి నిర్వహణ బాధ్యతలు కేంద్రానికి ఇవ్వడంపై ఇప్పుడు పోరుకు సై అంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News