Thursday, December 19, 2024

ఓరుగల్లులో బిఆర్‌ఎస్ మహా గర్జన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సిఎం కెసిఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహాలు షురూ చేసింది. పార్టీ నేతలు కెటిఆర్, కవిత, హరీష్ రావుతోపాటు ముఖ్య నేతలంతా తమ తమ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి జోరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కెసిఆర్‌కు వరంగల్ బాగా అచ్చొచ్చింది.

అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు సమాచారం. సహజంగా బిఆర్‌ఎస్ బహిరంగ సభ అంటేనే ప్రజలంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జన సమీకరణ, బహిరంగ సభ నిర్వహణ, ఏర్పాట్లు, ఇలా అన్నింట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. 150 ఎకరాల్లో బహిరంగ సభ, 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండేలా వరంగల్ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఏప్రిల్‌లో ప్రకటించారు. ఈ మేరకే సభ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ తొలి వారంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ముందే అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధమయ్యేలా బిఆర్‌ఎస్ అధిష్టానం ఏర్పాట్లు చేసుకుంటోంది. షెడ్యూల్ రాగానే భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

వరంగల్ లో బిఆర్‌ఎస్ నిర్వహించిన సభలు ఇవే
2001 జూన్ 21వ తేదీ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 2003 ఏప్రిల్ 26వ తేదీన సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ తీశారు. 2003 ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించగా, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ, అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ హాజరయ్యారు. 2005 జులై 17వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించగా, అప్పటి కేంద్రమంత్రి శరద్ పవార్ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు టిఆర్‌ఎస్ మంత్రులు రాజీనామా చేసిన తర్వాత నిర్వహించిన మొదటి సభ ఇదే. అలాగే 2007 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టిఆర్‌ఎస్‌లో ఆరో వార్షికోత్సవం నిర్వహించారు.

2009 నవంబర్ 23వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జెఎసి బహిరంగ సభ నిర్వహించగా, 14 విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ‘కెసిఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ నినాదాన్ని ప్రకటించారు. 2010 డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ మహా గర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్ రెడ్డి పేటలో భారీ బహిరంగ సభ నిర్వహించగా, స్వామి అగ్నివేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ బహిరంగ సభ ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా రికార్డు సాధించింది. 2017 ఏప్రిల్ 27వ తేదీన నగరంలోని ప్రకాశ్ రెడ్డి పేటలో పది లక్షల మందితో ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News