Saturday, September 21, 2024

గులాబి దళం కొత్త ఎత్తుగడ

- Advertisement -
- Advertisement -

‘బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. నాటి మంత్రులను అప్పటి సిఎం కెసిఆర్ పురుగుల్లా చూశారు. ఇప్పుడు ఎవరైనా తమ పనుల కోసం సిఎం కార్యాలయానికి వెళ్లే పరిస్థితి ఉంది. మాకు పనిలో పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇది కెసిఆర్ హయాంలో పని చేసిన మంత్రులకు ఒక కల మాత్రమే’ అని తెలంగాణ రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిదు నెలల కిందట మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయమే రేవంత్ రెడ్డి మంత్రిమండలి సభ్యులందరిలోనూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఆయా మంత్రుల శాఖల పనితీరు, మంత్రుల పెర్ఫార్మెన్స్, ముఖ్యమంత్రితో సంబంధాలు.. ఇతర అనేక కారణాలతో సిఎంకు, తన సహచరులకుమధ్య కొంత ‘గ్యాప్’ ఎక్కడయినా ఉంటే ఉండవచ్చు. లేకపోనూవచ్చు. ఏ రాష్ట్రం లో అయినా లేదా కేంద్రప్రభుత్వంలో అయినా ఇలాంటి ‘అంతరం’ అత్యంత సహజం.

నిజానికి ఈ పరిస్థితి తలెత్తడం ఒక ప్రజాస్వామిక లక్షణం. గ్యాప్ ఉండడమూ, దాన్ని సకాలంలో సరిదిద్దుకోవడమూ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ‘గ్యాప్’ అసంతృప్తిగా మొగ్గ తొడిగి, అసమ్మతిగా మారి, అది కాస్తా తనకు ఇబ్బందికరంగా మారే పరిస్థితిని ఏ ముఖ్యమంత్రి ఆహ్వానించరు. తన కేబినెట్ సహచరులకు, తనకు మధ్య కాకతాళీయంగానో లేదా అవగాహనారాహిత్యంతోనో ఏర్పడే ‘కమ్యూనిషన్’ గ్యాప్‌ను వీలైనంత త్వరగా తొలగించుకునేందుకు సిఎం హోదాలో ఉన్న నాయకుడు ప్రయత్నిస్తారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే సిఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని, తాజాగా బిఆర్‌ఎస్ భజనమండలి, కెసిఆర్, కెటిఆర్ సొంత మీడియా, కిరాయి మీడియా కొన్ని కథనాలను ప్రచారం చేస్తున్నది.

వీటిలో ప్రధానంగా 1. మంత్రులకు తెలియకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌కు కౌంటర్ చెక్ రాజకీయాలు నడుస్తున్నాయి. 3. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌తో సీనియర్ మంత్రి ఉత్తమ్ నిత్యం టచ్‌లో ఉన్నారు. 4. మంత్రివర్గ విస్తరణ జాప్యం వెనుక అంతర్గత విభేదాలు. 5. సిఎం. రేవంత్ సిఫార్సులపై సీనియర్ల అభిప్రాయాలను కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇంకా ఇలాంటి పలు అంశాలను బిఆర్‌ఎస్ తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నది. అయితే బిఆర్‌ఎస్ వైఖరి ‘గురివింద గింజ’ సామెతలాగే ఉన్నది. కెసిఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఆయన ఎవరినయినా సంప్రదించారా? ఎవరికయినా చెప్పారా? ఎవరి సలహాలు అయినా తీసుకున్నారా? వంటి ప్రశ్నలకు బిఆర్‌ఎస్ పార్టీ జవాబు చెప్పవలసి ఉన్నది. ఒకవేళ నిజంగానే కెసిఆర్ ప్రజాసామికంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే, కనీసం మంత్రులను విశ్వాసంలోకి తీసుకొని ఉంటే మరొక పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించగల నైతిక హక్కు ప్రతిపక్షానికి లభించేది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరు, నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలు, తానే రాజు తానే మంత్రి అనే ధోరణి, తాను చెప్పిందే వేదం అనే వైఖరి, తన నిర్ణయాలకు తిరుగుండదన్న మొండితనం, తాను దైవాంశ సంభూతుడ్ని అని నమ్మడం వల్ల వచ్చిన నిరంకుశతత్వం బిఆర్‌ఎస్ చావుదెబ్బ తినడానికి కారణాలు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

‘కెసిఆర్ కుటుంబం ప్రతి స్థలాన్ని కబ్జా చేసింది. మద్యం వ్యాపారాన్ని కూడా వదలలేదు. ఎంఎల్‌సి కవిత అరెస్టుతో జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతిన్నది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ‘ప్రజాపాలన’ అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నినాదం ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకున్నది. అనేక పథకాలు, ప్రాజెక్టులు తెచ్చినా కెసిఆర్ పాలనలో స్వేచ్ఛ లేదని ప్రజలు నమ్మారు కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టారు. తెలంగాణలో ‘ప్రజా పాలన’కు బీజం పడింది. కాంగ్రెస్‌లో మిగతా పార్టీల కంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. దీనినే స్వేచ్ఛగా భావిస్తారు. ఆ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసే వారికి ప్రత్యర్థులు సొంత పార్టీలోనే ఉంటారు. ‘గ్రూపు సంస్కృతి’ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని అనుకుంటాం.

కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా, ఈ గ్రూపు సంస్కృతి కనిపించకపోవడం, ముఠా కుమ్ములాటలు లేకపోవడం, పార్టీపైనా, పాలనపైనా సిఎం రేవంత్ రెడ్డి పట్టు బిగించడం… బిఆర్‌ఎస్‌కు రుచించడం లేదు. ఈ పరిణామాలు బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని కలచివేస్తున్నవి. ఇక లాభం లేదనుకొని కాంగ్రెస్ పార్టీని ‘లోపలి’ నుంచి నరుక్కు వచ్చే పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ పై, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు వంటి సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు కథనాలను వండి వార్చుతున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శ్రీధర్ బాబు, ఉత్తమ్, భట్టి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి తదితర మంత్రులు, నాయకుల కాంట్రిబ్యూషన్ ఉంది. దాన్ని తక్కువ చేసి చూపలేము. అలాగే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నాయకుల పాత్రను తోసిపుచ్చలేం. అందరూ సమష్టిగా, సమన్వయంతో పని చేశారు. పార్టీని విజయం వరించింది. పార్టీని విజయపథాన నడపడంలో రేవంత్ రెడ్డి దూకుడు, బిఆర్‌ఎస్ ఊహించని ఎత్తుగడలు అమలుచేయడం.. ముఖ్యమంత్రి పదవి లభించేందుకు కారణాలుగా ఒక విశ్లేషణ ఉన్నది.

రేవంత్ కేబినెట్‌లోని కొందరు సీనియర్లకు, సిఎంకు మధ్య ‘పొగ’బెట్టడానికి వెలుపలి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలియవచ్చింది. కానీ ముఖ్యమంత్రికి, తన సహచరులకు మధ్య నిజంగానే విభేదాలుంటే అది వేరే సంగతి. కానీ అసమ్మతి లేకుండానే ‘ఉరుములు, మెరుపులు’ కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నాలు భగ్నమవుతాయి తప్ప కెసిఆర్ ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అసలు ‘ప్రజాస్వామ్యం గురించి, మంత్రులు, ఎంఎల్‌ఎలు, నాయకులతో సత్సంబంధాల గురించి బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను తొలగించడం, ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడం వంటి కీలక రాజకీయ నిర్ణయాలన్నీ ‘ఏకపక్షం’గానే జరగలేదని చెప్పడానికి బిఆర్‌ఎస్ నాయకులకు దమ్ముఉందా? అని కొందరు విమర్శకులు ప్రశ్నిస్తుంటారు. కెసిఆర్ తన సహచర మంత్రులతో చర్చించి, వారి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి.

టిఆర్‌ఎస్‌కు కెసిఆర్ ’ఓనర్’ కనుక ఆయన ఏమి చేసినా చెల్లుబాటయ్యింది. జాతీయపార్టీ కాంగ్రెస్‌లో అలా సాధ్యం కాదు. ముఖ్యమంత్రి అయినా, మరొక గొప్ప నాయకుడయినా తమ మాట వినకపోతే, తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినట్లు భావిస్తే పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం సర్వసాధారణం. అయితే అనేక మార్గాలలో సమాచారం తెప్పించుకునే నెట్‌వర్క్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఉన్నది. అంత సులభంగా రాష్ట్రాల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఆగమేఘాల మీద చర్యలు తీసుకోరు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి గాను ‘లోపలి’ నుంచి నరుక్కు రావడానికి ఎవరెన్ని ప్రణాళికలు అమలుచేసినా వర్కవుట్ కాదు. ‘లోపల’ నిజంగానే అసమ్మతి ఉండాలి.

సిఎంపై ఆగ్రహం రావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో సిఎం రేవంత్ రెడ్డిని దెబ్బ తీస్తే ‘కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే’ అనే విషయం మంత్రులకు, సీనియర్ నాయకులకు తెలుసు. మనసులో ఎవరేమి అనుకున్నా హైకమాండ్ ఆశీస్సులు లేకుండా చేసే ప్రయత్నాలన్నీ వృథా. 2004 ప్రాంతాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిజెఆర్, మరికొందరు నేతలు నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై సోనియాగాంధీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా వాటిని హైకమాండ్ ఖాతరు చేయకపోగా వైఎస్. నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలవడం కాంగ్రెస్ సీనియర్లందరికీ తెలిసిన సంగతే!

ఎస్.కె. జకీర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News