మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. సిఎం రేవం త్‌రెడ్డి బిఆర్‌ఎస్ మహిళా ఎంఎల్‌ఎలను అవమానించారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆ సమయంలోనే సుప్రీం కోర్టు ఎస్‌సి వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక తీర్పు వెలువరించడంతో అధికార పార్టీ ఎస్‌సి వర్గీకరణ అంశంపై చర్చించాలని నిర్ణయించింది. దీంతో బిఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిండు సభలో మహిళా సభ్యులను అవమానించారని.. సిఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ మాత్రం ఎస్‌సి వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తాననడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో వెల్‌లో బైఠాయించగా.. మర్షల్స్ వారిని అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం ఛాంబర్ ముందు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నిరసనకు దిగారు.
అక్కడే కూర్చుని సిఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్న మార్షల్స్ బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ముందు కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ గేటు ముందు కూర్చుని సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కెటిఆర్ సహా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి తెలంగాణ భవన్‌కు తరలించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రు లు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్‌తోపాటు పాటు ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురి సభ్యులను అరెస్టు చేశారు.
సిఎం క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టం: కెటిఆర్
పోలీస్ వ్యాన్‌లో నుంచి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డలకు సిఎం క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టేది లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. మహిళా శాసనసభ్యులను అవమానపరిచిన సిఎంకు మహిళలంతా తగిన బుద్ది చెబుతారన్నారు. సిఎం అహంకారపూరిత మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ ఎంఎల్‌ఎలను క్షమాపణలు చెప్పే వరకు సిఎంను వదలమన్నారు. సిఎం డౌన్…డౌన్ అంటూ కెటిఆర్ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభలో విపక్షం గొంతునొక్కారన్నారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నారు. మరోవైపు శాసనసభలో సుమారు మూడుగంటలుగా నిల్చొని ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సిఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని బిఆర్‌ఎస్ మహిళా ఎంఎల్‌ఎలు స్పష్టం చేశారు.