Thursday, December 19, 2024

మార్పుకు నాంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం పూరించనుంది. దేశ రాజకీయాల్లో కీలక మలుపుతిప్పేందుకు ఖమ్మంలో బిఆర్‌ఎస్ సభ నాంది పలకబోతుంది. స్వీయ రాష్ట్రం కోసం 14ఏళ్ళపాటు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సిద్ధింపజేసిన ఒక నాటి ఉద్యమ పార్టీ.. నేడు దేశరాజధాని ఢిల్లీ గడ్డపై పాగా వేసేందుకు ఖమ్మం గుమ్మం నుంచే సమరభేరి మోగించబోతుంది. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి దేశానికి దిశ, దశ నిర్దేశించేందుకు ఖమ్మం నగరం వేదిక కాబోతుంది. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన సందర్భంగా బుధవారం ఖమ్మం నగరంలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభను భారీ ఎత్తున్న ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక ద్వారానే బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయ కార్యాచరణ ప్రారంభం కాబోతుంది.

ఆప్, స మాజ్‌వాది,సిపిఎం,సిపిఐ పార్టీల ముఖ్యనాయకులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిజెపిపై సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ కేంద్రంగా తొలిసారి ఐదు జాతీ య రాజకీయ పార్టీలు, నలుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ సభ వేదికపైనే బిఆర్‌ఎస్ రాజకీయ ఏజెండా ఖరారు కానుంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేళ్ళ కాలంలో చేపట్టిన అభివృద్ధి, సం క్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో, జాతీయ రాజకీయాల్లో కూడా క్రీయాశీలక పాత్ర పోషించి దేశ గతిని మార్చాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నో విప్లవ పా ర్టీలకు పురుడు పోసిన ఖమ్మం జిల్లా నుంచే శ్రీకారం చుట్టబోతున్నది. టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటైన తరువాత ఆవిర్భావ సభ కరీంనగర్‌లో తొలిసారిగా 2001 మే 17న నిర్వహించారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభను బుధవారం ఖమ్మం నగరంలో నిర్వహిస్తోన్నారు.

ఖమ్మం నడిబొడ్డున నిర్వహించే ఈ సభ ద్వారా ఉమ్మడి జిల్లాను ఆనుకొని ఉన్న ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో కీలకంగా మా రి జాతీయ రాజకీయాలను మలుపు తిప్పాలని భావిస్తున్న కెసిఆర్ సైద్ధాంతికంగా బిజెపికి బద్ధశత్రువులైన కమ్యూనిస్టులను అక్కున చేర్చుకోవాలనే యో చనలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యం కూడా ఒక కారణం కావొచ్చు. ఒకనాడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఈ జిల్లాలో ప్రతి సెగ్మెంట్లో వారికి ఇప్పటికీ కాస్తోకూస్తో ఓటు బ్యాంక్ ఉంది. రానున్న ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు కూడా ఈ సభను ఓ అవకాశంగా వినియోగించుకుంటున్నారు. అందుకే ఈ సభకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలను సైతం ఆహ్వానించారు. ఇప్పటికే ఇరు పార్టీలు మునుగోడులో కలిసి పనిచేసి సఫలీకృతులయిన విషయం విదితమే. ఈ స్నేహం ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో వామపక్షాల పొత్తుకు మార్గం సుగమం కావొచ్చు. దీనిలో భాగంగానే సిపిఎం ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తమ బలం ఏమిటో నిరూపించుకొంది.

సరిహద్దు రాష్ట్రాల్లో విస్తరించడానికేనా?

ఖమ్మంలో బిఆర్‌ఎస్ బహిరంగ సభ విజయవంతం అయితే.. ఆ ప్రభావం ప్రక్క రాష్ట్రాలపైపడే అవకాశం ఉంది. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ, మధ్యలో ఛత్తీస్‌గఢ్‌కు ఖమ్మం ఉమ్మడి జిల్లా పొరుగున ఉన్నందున తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రచారం కల్పించే క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రజలకు ఈ సభ ద్వారా మంచి సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాత ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లావాసులతో ఆంధ్రవాసులకు బంధుత్వాలు చాలానే ఉన్నాయి. దీంతో ఎపిలో కూడా బిఆర్‌ఎస్ విస్తరించాలని భావిస్తున్నందున బిఆర్‌ఎస్ అవిర్భావ సభకు ఆంధ్రకు చెందినవారిని పెద్దఎత్తున్న తరలించాలనే ఉద్దేశ్యంతో ఖమ్మంను ఆవిర్భావ సభకు వేదికగా మార్చినట్లు తెలుస్తోంది.

సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాలు, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, పువ్వాడ నాగేశ్వర రావు ఇతర జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. ఖమ్మం జిల్లా ఏర్పాటైన తరువాత ఇంత పెద్దఎత్తున్న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు, పలు ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో బహిరంగ సభలు జరిగాయి. 2018 ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాకూటమి అభ్యర్థుల విజయంకోసం రాహుల్ గాంధీ, చంద్రబాబులు కలిసి ఖమ్మం నగరంలో భారీ సభను నిర్వహించారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ, భారీ బహిరంగ సభను కూడా ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ‘అబ్‌కి బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన

తరువాత తొలి సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ఈ సభ ద్వారా కెసిఆర్ ప్రజలకు వివరిస్తారు. దేశ రైతాంగానికి, రాజకీయపక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. బిఆర్‌ఎస్ రాజకీయ ఏజెండాను ఇక్కడ నుంచే ప్రకటించే అవకాశం ఉంది.

బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముస్తాబైన ఖమ్మం

ఖమ్మం నగరానికి పది కి.మీ దూరంలో రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనానికి సమీపంలో వంద ఎకరాల స్థలంలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముస్తాబైంది. పక్షం రోజుల నుంచి అవిశ్రాంతంగా శ్రమించి సభా వేదికను సిద్దం చేశారు. వాస్తుపై గట్టి విశ్వాసం కలిగిన కెసిఆర్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖమ్మంలో సభను ఏర్పాటు చేయడమేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆరే గూగుల్ మ్యాప్ ద్వారా కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉత్తరం వైపు ఉన్న వంద ఎకరాల స్థలాన్ని బహిరంగ సభ వేదికగా ఖరారు చేశారు. ఈ స్థ్థలానికి దక్షిణవైపున ఎత్తెన గుట్టలు ఉండటం వాస్తుపరంగా కలిసివస్తుందని భావిస్తున్నారు. ప్రగతి భవనంలోని వాస్తు సిద్ధాంతి తేజ కూడా ఇక్కడ పర్యటించి వాస్తు సవరణలు చేశారు.

‘నభూతో.. నా భవిష్యతి ’ అనే చందంగా నిర్వహించే ఈ సభకు దాదాపు 5లక్షల మంది జనసమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండున్నర లక్షలు, నల్లగొండ, వరంగల్ పాత జిల్లాల నుంచి మరో రెండు లక్షలు, ఇక తెలంగాణ నలుమూలల నుంచి మరో 50వేల మంది ముఖ్య కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తరలించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఖమ్మం నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పూర్వ జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు తెలంగాణవ్యాప్తంగా ఉన్న బిఆర్‌ఎస్ ముఖ్యనాయకులతో పాటు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున్న జనం స్వచ్ఛందంగా కదలిరానున్నారు. ఈ సభ సందర్భంగా ఖమ్మం నగరంలో అడుగడుగున గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎక్కడచూసినా భారీ కటౌట్లు, ఫ్ల్లెక్సీలు, స్వాగత ద్వారాలు, ఆర్చీలు బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా సభ జరిగే పరిసర ప్రాంతాలన్ని బిఆర్‌ఎస్ కటౌట్లతో, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సభావేదికకు అతి దగ్గరలో రోడ్డుకు ఇరువైపులా సుమారు 500 ఎకరాల స్థలాల్లో 20 పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు.

సిఎంలచే నూతన కలెక్టరేట్, కంటి వెలుగు ప్రారంభం

రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం సమీపంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సిఎం కెసిఆర్, ఇతర ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముందు ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఇదే భవనంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నలుగురు ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా ఆరుగురు కంటి చూపు లోపం ఉన్నవాళ్ళకు నలుగురు ముఖ్యమంత్రుల చేత కళ్ళజోళ్ళను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కలెక్టరేట్ సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు నేతలంతా వెళ్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు ఇలా మొత్తం 52మంది వేదికపై ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. సభకుముందు రసమయి బాలకిషన్, సాయిచంద్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News