హైదరాబాద్ ః బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన తేదీని కెసిఆర్ ఖరారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఎపి నుంచి పెద్ద పెద్ద నేతలు తమను సంప్రదిస్తున్నారని, భారీగా బిఆర్‌ఎస్‌లోకి చేరికలు ఉంటాయన్నారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామని చెప్పారు. దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించబోతుందని అన్నారు. ఎపిలో బిఆర్‌ఎస్ పార్టీ సిఎం జగన్‌కు బి టీం అంటున్న బిజెపి, టిడిపి విమర్శలకు అర్ధం లేదన్నారు. ఎపిలో కూడా ప్రభుత్వ విధానాలపై బిఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బిజెపివి నిరాధార ఆరోపణలు
ప్రజల దృష్టిని మరల్చేందుకు బిఆర్‌ఎస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు బిజెపి నేతలు చేస్తున్నారని ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మండిపడ్డారు. మియాపూర్‌లోని నాలుగువేల కోట్ల విలువైన భూములను సిఎం కెసిఆర్ తనకు ధారాదత్తం చేశారని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి నేతలు పనికిమాలిన ఆరోపణలతో అటు ప్రజలను, ఇటు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు ఆరోపణలు నిజమైతే మియాపూర్ భూముల్లో 90 శాతం మీరే తీసుకోవాలని, మిగిలిన 10 శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలని బిజెపి నేతలకు ఆయన హితవుపలికారు.
త్వరలో విశాఖపట్నంలో బిఆర్‌ఎస్ సభ
- Advertisement -
- Advertisement -
- Advertisement -