Wednesday, January 22, 2025

నాందేడ్ సభకు నాంది

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల 5వ తేదీన మహరాష్ట్రలో బిఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ
సభ కోసం ముస్తాబు అవుతున్న నాందేడ్
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సభ వేదికకు పూజ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి:మహరాష్ట్రంలో బిఆర్‌ఎస్ తొలి బహిరంగ సభకు శరవేగంగా పనులు జరుగుతున్నారు. వచ్చే నెల 5వ తేదీన మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీ బహిరంగ సభకు బిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ సభను అట్టహాసంగా పూర్తి చేసుకున్న బిఆర్‌ఎస్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మహరాష్ట్ర తరువాత కర్నాటకలో కూడా మరో బహిరంగ సభను జరపాలని నిర్ణయించారు.

సొంత రాష్ట్రం (తెలంగాణ) తరువాత బయట రాష్ట్రాల్లో ఇదే మొదటి బహిరంగ సభ కావడంతో కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను ఇప్పటికే పలువురు మంత్రులు, మహరాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహరాష్ట్రలో బిజెపికి అనుకూలంగా షిండే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా బిజెపికి అనుకూలంగా ఉన్న రాష్ట్రంలో బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ నేతలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ప్రధనంగా భారీగా జన సమీకరణ చేసి బిఆర్‌ఎస్ సత్తాను బిజెపి పాలిత రాష్ట్రాలకు చూపించాలన్న కసితో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

అలాగే మరి కొందరు అగ్రనేతలు కూడా త్వరలోనే నాందేడ్‌కు వెళ్లి సభ పూర్తి అయ్యేంత వరకు అక్కడే మాకం పెట్టనున్నారు. సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. అలాగే సభ పనులతో పాటు జన సమీకరణపై ఎప్పుటికప్పుడు పార్టీ నేతలు కెసిఆర్‌కు వివరించనున్నారు. సిఎం కూడా నాందేడ్ సభను చూసి బిజెపికి ముచ్చెమటలు పట్టే విధంగా భారీగా సభ జరగాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం నాందేడ్‌లో పర్యటించారు. అక్కడి నేతలతో ముచ్చటించారు.

నాందేడ్ సభ సన్నాహల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా అప్పారావు పేట్, షివిని, ఇస్లాపూర్, హిమాయత్‌నగర్ గ్రామాల్లో కలియ తిరిగారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్థానిక ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కాలనీల్లోకి వెళ్ళి వృద్దులతో ముచ్చటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేద ఫించన్లు కూడా రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చివరకు తాము గూడుకు కూడా నోచుకోవడం లేదని, మంచి సౌలత్లు లేవని మహిళలు, వృద్దులు మంత్రి ముందు వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మాకుకూడా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నదే బిఆర్‌ఎస్ లక్షమమన్నారు. ఈ నేపథ్యంలో నాందేడ్ సభకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫించన్లు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు వంటి అనేక పథకాలను అన్ని రాష్ట్రాల ప్రజలు కావాలని కోరుకుంటునారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా బహిరంగ సభ కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ భూమి పూజ చేశారు. ఆయనతో పాటుగా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు హనుమంత్ షిండే, జోగు రామన్న, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సభలో కెసిఆర్ సమత్రంలో మహరాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News