Friday, December 20, 2024

బిఆర్‌ఎస్ నేత క్రిశాంక్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో ఇటీవలే ఓయూ పోలీసులు క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మెస్‌లు మూసివేతపై సర్క్యులర్ జారీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా, వాటిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి క్రిశాంక్, నాగేందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి కొత్త గూడంకు వీరిద్దరు వెళుతుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ పట్టణ పోలీసులు స్థానిక ఠాణాకు తీసుకెళ్లారు. తర్వాత ఓయూ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి క్రిశాంక్‌ను అప్పగించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం : దీనిపై వెంటనే బిఆర్‌ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్, బిజెపి కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నాడు ఎమర్జెన్సీ చూశామని, ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్, బిజెపిలకు పట్టడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుపై సిఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు.

విశ్వవిద్యాలయానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత క్రిశాంక్‌ను కోర్టు అనుమతితో 24 గంటల జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న ఓయూ పోలీసులు ఆయనను విచారించారు. ఓయూ సర్క్యులర్‌ను డాక్యుమెంట్ ఎలా వచ్చిందని క్రిశాంక్‌ను ప్రశ్నించారు. లేకపోతే మార్ఫింగ్ చేశారా లేదా ఎవరైనా మార్ఫింగ్ చేసి దానిని పంపించారా? ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశారని ప్రశ్నించారు. తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News