Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకుగాను దిలీప్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో సిసిఎస్‌లో సోమవారం విచారణకు దిలీప్ హాజరయ్యారు దిలీప్. విచారణ అనంతరం సైబర్ క్రైం పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు పోలీసులు తరలించా రు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా దిలీప్ పని చేశారు. 2024 ఆగస్టు 31న ఆసిఫాబాద్ జై నూర్ ఆదివాసీ మహిళ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు చేసినందుకు పోలీసులు దిలీప్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 5న అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ కేసులో సోమవారం సిసిఎస్ ముందు విచారణకు హాజరవ్వగా, పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

కొణతం దిలీప్ అరెస్ట్ పై కెటిఆర్ మండిపాటు

తెలంగాణ డిజిటల్ మీడియామాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టుపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే సంకెళ్లు.. నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని, తెలంగాణలో నియంత రాజ్యం, నిజాం రాజ్యాంగం నడుస్తున్నాయని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారని, విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం కనబర్చారు. అలాగే ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని, తాము ప్రజాస్వామ్య ప్రేమికులమని, ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇక మీ అక్రమ అరెస్టులకో.. ఉడత బెదిరింపులకో.. భయపడమని, మీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ! అని అన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందన

కొణతం దిలీప్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు స్పందించారు. కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. కక్షపూరిత, ప్రతీకార చర్యలు మానుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు.

కొణతం దిలీప్ అరెస్ట్ అక్రమం : వేముల ప్రశాంత్ రెడ్డి

కొణతం దిలీప్ అరెస్ట్ దుర్మార్గమని మాజి మంత్రి,బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిని అణిచివేయడం ప్రజా పాలనా అంటూ ఆయన నిలదీశారు. విచారణ పేరు మీద పిలిచి అక్రమంగా అరెస్టు చేయడం హేయనీయమైన చర్య అని తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. కొణతం దిలీప్ తెలంగాణ ఉద్యమ కారుడని,ఉద్యమ కారులకు కేసులు,అరెస్టులు కొత్త కాదు అని గుర్తు చేశారు. ప్రభుత్వ అక్రమ నిర్బ ంధాల తీరును ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారని వేముల పేర్కొన్నారు.

అక్రమ అరెస్ట్ అమానుషం : దేవీ ప్రసాద్

ప్రభుత్వ వైపల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న కొణతం దిలీప్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషమని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడానికి స్టేషన్‌కు పోయిన దీలిప్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తే నిర్బంధాలా? అని ప్రశ్నించారు. హైడ్రా, లగచర్ల, మూసి, పేరా పెద ప్రజలపై అప్రకటిత నిర్భందాన్ని కొనసాగిస్తూ రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్ కు పంపడాన్ని వివిధ మాద్యమాల ద్వారా ప్రజలకు తెలిపిన డిజిటల్ మాజీ డైరెక్టర్ దీలిప్‌ను నిర్బంధించినంత మాత్రాన ప్రశ్నలు ఆగవని, సమస్యల పరిష్కారం అయ్యేవరకు బిఆర్‌ఎస్ పోరాడుతుందని, వెంటనే దిలీప్‌ను విడుదల చేయాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News