Friday, January 10, 2025

గడప గడపకు కెసిఆర్ భరోసా

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ భరోసా పేరుతో బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. కెసిఆర్ భరోసా కింద తెలంగాణ యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని కెటిఆర్ ప్రకటించారు. ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారో ..అంతమందిని మళ్లీ నిర్ధిష్ట కాలవ్యవధితో భర్తీ చేసే విధం గా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హా మీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.20 లక్షల ఉ ద్యోగాలు భర్తీ చేస్తున్నామని, అందులో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చే శామని, మరో 8090 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆసరా పెన్షన్ల కింద కెసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా 46 లక్షల మందికి రూ.2016,
దివ్యాంగులైతే రూ.4016 పెన్షన్ ఇస్తున్నారని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే రూ.2016 ఇస్తున్న ఆసరా పెన్షన్‌ను కెసిఆర్ భరోసా కింద రూ.5016 చేయబోతున్నామని,

దివ్యాంగులైతే రూ.6016 చేయబోతున్నామని, 75 ఏళ్ల ఏ నాయకుడు చేయని విధంగా సిఎం కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు ఇచ్చుకున్నామని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే కెసిఆర్ భరోసా కింద రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచబోతున్నామని, అలాగే అన్నపూర్ణ కార్యక్రమం కింద రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డుబియ్యం బదులు సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. కెసిఆర్ భరోసా కింద సౌభాగ్య లక్ష్మిఅనే కొత్త కార్యక్రమం ప్రారంభించబోతున్నామని, ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేల చొప్పున భృత్తి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని,కెసిఆర్ భరోసా కింద అసైన్డ్ భూములు కలిగి ఉన్న దళితులు, గిరిజనులు వాళ్ల భూములను వాళ్లు అమ్ముకునేలా హక్కును ఇవ్వబోతున్నామని వెల్లడించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణరెడ్డి,

రామ్మూర్తి తమ మద్దతుదారులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులకు వివరించారు. కెసిఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోలో 15 కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాలతో అధికార వికేంద్రీకరణ చేసి, ప్రజల వద్దకు పాలన తెచ్చింది కెసిఆర్ అని పేర్కొన్నారు.కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని తెలిపారు. 2014కు ముందుకు ఎట్ల ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్టయిందో ఆలోచించాలని కోరారు. విద్య, వైద్యం, కులవృత్తులు, పల్లెలు, పట్టణాలు …ఇలా రంగాలు బాగయ్యాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కు
కరెంట్ విషయంలో కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటే దిక్కు అవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కరెంట్ లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు. గాడిన పడుతున్న రాష్ట్రాన్ని గద్దలపాలు చేయొద్దని సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు అప్పుడే అక్కడి ప్రజలు బాధలు పడుతున్నారని విమర్శించారు.కర్ణాటకలో కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినందుకు రైతులు లెంపలేసుకుంటున్నారని విమర్శించారు. ఖర్గే సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు 11 సార్లు మోకా ఇస్తే…బార్ బార్ డోకా చేశారని విమర్శించారు. ఖర్గే సొంత రాష్ట్రంలోనే కరెంట్‌కు దిక్కులేదని, అలాంటోళ్లు తెలంగాణకు వచ్చి ఇక్కడ గెలిపిస్తారట అని విమర్శించారు.

కూట్ల రాయి తీయలేనోడు…ఏట్ల రాయి తీస్తడా…? అమ్మకు అన్నం పెట్టనోడు…చిన్నమ్మ బంగారు గాజులు చేయిస్తడా..? అని నిలదీశారు. ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయన సొంత రాష్ట్రమైన కర్ణాటకలోనే కరెంట్‌కు దిక్కులేదని, తెలంగాణకు వచ్చి ఖర్గే, ఆయన పార్టీ ఏం ఉద్దరిస్తావని అడిగారు. కర్ణాటకలో అక్కడి రైతులు మొసళ్లను తీసుకెళ్ళి సబ్ స్టేషన్‌లో వదిలిపెట్టారు చెప్పారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే 3 గంటల కరెంటే దిక్కు అని హెచ్చరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ బేకార్ పార్టీ అని, వాళ్లు ఫెయిల్ కావడంతో పాటు తెలంగాణను, దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇదివరకే 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదో కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పాలని నిలదీశారు.

కాంగ్రెస్ నాయకులందరినీ దూరం చేసుకుంది
కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎవరినీ ఓన్ చేసుకోలేదని, అందరు నాయకులను దూరం చేసుకుందని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ను గ్రామాలలో తెలంగాణ పార్టీ అని అంటారని, తమ పార్టీని ప్రజలు తమ ఇంటిపార్టీగా భావిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాకముందు ఎవరైనా చనిపోతే స్నానాలు చేసేందుకు నీళ్ల కోసం కరెంటోళ్లకు ఫోన్లు దుర్భర పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ సమస్య, నీళ్ల సమస్య పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పికి పునరుజ్జీవం పోసిన ప్రాజెక్టు కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు.

ఇవాళ వరద కాలువ సజీవంగా మారిందంటే అది కాళేశ్వరం వల్లనే అని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం కూడా సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎక్కడ చూసిన పచ్చగా మారిందని కెటిఆర్ స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని వెల్లడించారు. రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా సొంతింటికి తిరిగి వచ్చిన సత్యనారాయణ రెడ్డికి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానమని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News