Wednesday, January 22, 2025

‘ముక్కోణం’లో మునిగేదెవరు?

- Advertisement -
- Advertisement -

ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలిక కీలక అంశంగా మారింది. రణక్షేత్రంలో అధికార బిఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా, పలు పార్టీలు బరిలో నిలిచాయి. అయితే పోటీలో ప్రధానంగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చీల్చే ఓట్లే అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. అయితే విపక్షాలు చీల్చే ఓట్లు ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతాయి? ఎవరిని విజయ తీరాలకు చేరుస్తాయనేది ఇప్పడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. చీల్చే ఓట్లే కాకుండా లోపాయికారిగా జరిగే ఒప్పందాలు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు జరగనున్న ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌తో బిజెపి, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అటు బిఆర్‌ఎస్‌తో ఇటు కాంగ్రెస్‌తో పొత్తు కుదరక సిపిఎం కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నది. సిపిఐ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేస్తున్నది. సిపిఎం సొంతంగా గెలిచే అవకాశాలు లేకున్నా ఆ పార్టీ నియోజకవర్గాల వారీగా చీల్చే మూడు నుంచి నాలుగు వేల ఓట్లు అధికార బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నా రు.

సిపిఐ నుంచి కాంగ్రెస్‌కు ఆ పార్టీ పోటీలో లేనిచోట ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది కూడా చర్చగా మారింది. మొత్తంగా చీలే ఓట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అధికార పార్టీకి అనుకూలంగా మారవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్, బిజెపిలు భారీగా ఓట్లను చీల్చకుంటే ఫలితం మరో రకంగా కూడా ఉండవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా పరిశీలకులు ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల దాకా బిజెపి కొంత పుంజుకున్నట్లు కనిపించినా ఇటీవల కాలం లో ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ రాష్ట్రం లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తర్వాత నాలుగో స్థా నంలోకి జారింది. అయినా బిసి సిఎం నినాదం, ఎస్‌సి వర్గీకరణ సమస్యకు పరిష్కారం పేరుతో తన ఉనికిని చాటుకోవాలని బిజెపి ఆ పార్టీ అతిరథులను రంగంలోకి దించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎస్‌సిల వర్గీకరణ భారీ సభకు హాజరై ఈ సమస్యకు ముగింపు చెపుతామని గట్టి హామీ ఇచ్చారు.

దీనితో తెలంగాణలో అనేక నియోజక వర్గాల్లో బలంగా ఉన్న ఎస్‌సిలు మోడీ సభకు హాజరైనట్లుగా ఓట్లు వేస్తే అవి కూడా బిజెపి పరంగా భారీగా చీలవచ్చు. అంతిమంగా ఇది కూడా సంక్షేమం అభివృద్ధి సమతుల్యత, తెలంగాణ మోడల్ లాంటి నినాదాలతో జనంలోకి విస్తృతంగా వెళుతున్న అధికార బిఆర్‌ఎస్‌కు కొంత మేరకు లబ్ధి జరగవచ్చని పరిశీలకులు అం చనా వేస్తున్నారు. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రె స్ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంతో బిజెపి హుజూరాబాద్, దుబ్బాకలో విజయాలను సాధించింది. కానీ మునుగోడులో త్రిముఖ పోరు బలం గా ఉండడంతో బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవగలిగారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి పా ల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయినా 24 వేల ఓట్ల దాకా సాధించగలిగారు. దీంతో బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 10వేల ఓట్లతో ఓడిపోయా రు. అదే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3 వేల ఓట్లే సాధించడంతో బిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఈటల రాజేందర్‌పై ఓడిపోయారు.

ఇక్కడ కూడా కాంగ్రెస్ మునుగోడు లా 20 నుంచి 30వేలు చీల్చితే బిఆర్‌ఎస్ అభ్యర్థి త్రిముఖ పోరులో గెలిచేవారు. కాని కారణాలేమిటో తెలియదు గాని కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ కనీస ఓట్లను కూడా సాధించకపోవడంతో ఈటల రాజేందర్ విజయం సాధించగలిగారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలను విశ్లేషిస్తే ఇక్కడ కూడా త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కనీసం తాను సాధించిన 22 వేల ఓట్లకు మించి మరో 2 వేల ఓట్లు చేజిక్కించుకొంటే త్రిముఖ పోరులో బిఆర్‌ఎస్ అభ్యర్థి సొలిపేట సుజాత గెలిచేవారు. ఇక్కడ గెలిచిన రఘునందన్ కేవలం 1079 ఓట్లతో విజయాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరులో కూడా ముక్కోణపు పోటీలే ఎక్కువగా వున్నాయి. దాదాపు 40 స్థానాల్లో గట్టి త్రిముఖ పోటీ జరుగుతున్నదని అభ్యర్థుల జాబితా స్పష్టం చేస్తున్నది. దీని వల్ల కాంగ్రెస్, బిజెపిలు బలంగా ఓట్లు చీల్చితే ఫలితం ఎలా వుంటుంది? లేదంటే లోపాయికారిగా పొత్తులతో పోలింగ్‌కు ముందు ఒకరే పోటీలో వుంటే ఫలితాలు ఆసక్తికరంగా వుండే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అందుకే రాష్ట్రంలో ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్‌లు పోటీ పడుతూ బిఆర్‌ఎస్‌కు మీరు బి టీం అంటే మీరు అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు.అన్ని పార్టీలు ఈ విషయమై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, హైదరాబాద్‌లో పటిష్టమైన ఓటు బ్యాంకు వున్న ఎంఐఎంలు కొన్ని చోట్ల నామమాత్రంగా అభ్యర్థులను పోటీలో పెట్టడం లేదా బలం వున్నా పోటీలో లేకపోవడం పలు రకాల చర్చలకు తావిస్తున్నది. అయితే మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార బిఆర్‌ఎస్ పార్టీ మాత్రం విపక్షాలు ఎంతగా ఓట్లను చీలిస్తే తమకు అంతగా లాభమని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఓట్ల చీలికే కాకుండా పోలయ్యే ఓట్ల శాతం కూడా అభ్యర్థుల జయాపజయాల్లో కీలకం కానుండడంతో ఓట్ల శాతం పెరిగే విధంగా అధికార పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నది. ఈ మేరకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా నగర, పట్టణం ఓటర్లు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా పోలింగ్ కేంద్రాల దాకా రావాలంటూ భారీ పోలింగ్ కోసం తన ప్రచారాల్లో ఓటర్లను కోరుతున్నారు.

గత ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగితే ఎక్కువగా అధికారంలో వున్న పార్టీ గెలుపు సాధించిన సందర్భాలు వుండడంతో ఆయన ఓటర్లను చైతన్యవంతులను చేయడాన్ని కూడా ఎన్నికల ప్రచార అంశంగా మార్చారు. హైదరాబాద్ లాంటి చోట్ల కనీసం 50 శాతానికి ఓట్లు పోలు కాకపోవడంతో జయాపజయాలు అంచనా వేయలేని విధంగా మారడంతో పోలింగ్ శాతం నగరం, పట్టణాల్లో కూడా 70 శాతానికి పెరిగే విధంగా అధికార పార్టీ ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వున్న ఓటర్లను రప్పించే ప్రయత్నాల్లో వుంది. మొత్తంగా ముక్కోణం పోటీ ఎవరిని ముంచుతుందో, ఎవరిని ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేని విధంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News