Tuesday, September 17, 2024

పోటీకి దూరం.. జెడి(ఎస్)కు మద్దతు: కర్నాటకపై కెసిఆర్ యోచన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(ఎస్)కు అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) మద్దతు ఇస్తోందని, మిత్రపక్షం పోటీలో ఉన్నందున పార్టీ తరఫున ఏ ఒక్క అభ్యర్థినీ బరిలో నిలపకూడదని బిఆర్‌ఎస్ నిర్ణయించిందని బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న బిఆర్‌ఎస్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే..మిత్ర పక్షమైన జెడి(ఎస్) పోటీలో ఉండడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు తగినంత వ్యవధి లేకపోవడంతో బిఆర్‌ఎస్ తన ఆలోచనను మార్చుకున్నదని బిఆర్‌ఎస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

పూర్తి సన్నద్ధత, పక్కా ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో పోటీచేయడం పట్ల పార్టీ నాయకత్వం సుముఖంగా లేదని వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగుపెట్టేందుకు బిఆర్‌ఎస్ సన్నహాలు చేస్తున్న విషయాన్ని వర్గాలు ప్రస్తావించాయి. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో ఇప్పటికే రెండు బహిరంగ సభలలో ప్రసంగించిన బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 24న ఛత్రపతి సంభాజీ నగర్(ఔరంగాబాద్)లో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

జెడి(ఎస్) అధినేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నుంచి ఆహ్వానం వస్తే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(ఎస్) అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే విషయాన్ని కెసిఆర్ పరిశీలిస్తారని వారు చెప్పారు. అయితే దీనిపై కెసిఆర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు తెలిపారు. అయితే..కర్నాటకలో తాను ప్రచారం చేయడం వల్ల బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బిజెపి లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోలేదన్న ఆందోళన బిఆర్‌ఎస్‌లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News