70 సీట్లకి పైగా గెలిచి సింగల్ లార్జెస్ట్ పార్టీగా బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
ఎగ్జిట్ పోల్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది
కెసిఆర్ కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం బిల్లులు ఇప్పించారంటూ కాంగ్రెస్ నాయకులు
ఇసికి లేఖ రాయడం ఆ పార్టీ చిల్లర లేకితనానికి పరాకాష్ట
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికార పనులు, కార్యక్రమాలు అయినా
ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి
ఈ విషయం కూడా తెలియకుండా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నారు
దీనిని తెలంగాణ సమాజం గమనించాలి
బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియన్ నాయకులు దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ముమ్మాటికీ 70 సీట్లకి పైగా గెలుపొంది సింగల్ లార్జెస్ట్ పార్టీగా మళ్లీ అధికారంలో వస్తుందని, కెసిఆర్ హ్యాట్రిక్ సిఎం అవుతారని పేర్కొన్నారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్ శాడిస్టిక్ ఆనందం పొందుతోందని, రేవంత్ కాంగ్రెస్ లేకితనానికి పరాకాష్టగా మారిందని విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో శనివారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ లేకి తనాన్ని ప్రదర్శిస్తూ సిఎం కెసిఆర్‌పై బట్టకాల్చి మీదేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం లేకుండానే ఇంత లేఖి తనం చూపిస్తున్న కాంగ్రెస్ నాయకులు, సంప్రదాయాలు తెలియకుండా కేబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ చేసి, ప్రజలుని అయోమయానికి గురి చేస్తూ పైశాచిక అనందం పొందుతున్నప్పటికీ తమ అంచనాలు, సర్వేలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో కెసిఆర్‌ది పేగు బంధం అని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు మధ్య చాలా తేడా ఉంటుందని అన్నారు. కెసిఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు.
కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. సిఎం కెసిఆర్ కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఆరువేల కోట్ల రూపాయిలు బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్ పార్టీ ఇసికి లేఖ రాయడం ఆ పార్టీ చిల్లర లేకితనానికి పరాకాష్ట అని, ఇది దుర్మార్గమైన తప్పుడు చిల్లర ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అయితే ప్రజాస్వామ్య పద్దతులు, ప్రోటోకాల్ తెలియదు అని, మంత్రిగా, ఎంపిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ పనిచేసిన భట్టి విక్రమార్క లాంటి నాయకులు ఇలాంటి చిల్లర లేఖపై ఎలా సంతకం పెట్టారు..? అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ బ్యూరోక్రసిని, ఎన్నికల సంఘాన్ని అవమానించడమే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారిక పనులు, కార్యక్రమాలు అయినా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పర్యవేక్షణలో జరుగుతాయని, ఈ విషయం కూడా తెలియకుండా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న లేకి ప్రచారాన్ని తెలంగాణ సమాజం గమనించాలని సూచించారు.
డికె శివకుమార్‌కు తెలంగాణలో ఏం పని?
కర్నాటక గద్దలు, ఎపి నుంచి పచ్చపార్టీ గద్దలు, ఢిల్లీ గద్దలు తెలంగాణని కమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆ నాయకులు తెలంగాణ ప్రజలను గురి చేసి తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని, మనందరం జాగ్రత్తగా ఉందామని చెప్పారు. కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ గెలవనుందని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. ఎన్నకల ఫలితాలు రాకుండానే కాంగ్రెస్‌లో పోర్టు ఫోలియోలా పంచాయితీలు పెట్టుకొని లేకితనాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకుల అడ్రస్‌లు గల్లంతు కానున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాట్ పోల్స్‌కు ఎప్పుడూ తేడా వుంటుందని, 2 కోట్ల 32 లక్షల మంది ఓట్లు వేస్తే 26 వేల మంది సాంపిల్స్ తెచ్చి తెలంగాణ మొత్తం ఇలా ఉందని థ్రిల్లర్స్ పోల్స్ మాదిరిగా ప్రజలని అయోమయంలోకి నెట్టేస్తున్నారని అన్నారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ఇచ్చిన ఏ గ్యారెంటీలు అమలు కాక ప్రజలు అతలాకుతలం అవుతున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కానీ ఆ రాష్ట్ర నాయకుడు డికె శివకుమార్ లాంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం మీద గద్దలా వాలడానికి రాత్రికి రాత్రి వస్తానంటున్నారని మండిపడ్డారు. కర్నాటకలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న డికె శివకుమార్ అక్కడి ప్రజల ఇబ్బందులను, అక్కడి సమస్యలను పట్టించుకోకుండా ఆయనకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. ఇక్కడ రాజకీయాలు చేయడం ఇక్కడ వున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులకు చేతకాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కెసిఆర్ టచ్‌లో ఉన్నారని డికె శివకుమార్ అంటున్నారని, అంటే బిఆర్‌ఎస్ సింగిల్ లార్జస్ట్ పార్టీగా అవతరిస్తుందని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నట్లే కదా అని అడిగారు. బిఆర్‌ఎస్ పార్టీ ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.