Monday, December 23, 2024

మూడోసారి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బిఆర్‌ఎస్ పార్టీనే: ఎంఎల్‌ఎ గండ్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బిఆర్‌ఎస్ పార్టీనే అని గండ్ర వెంకటరమణారెడ్డి తేల్చి చెప్పారు.

మోసం చేయటంలో బిజెపిని మించిన పార్టీ, మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని అన్నారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శుక్రవారం గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాలు అంబరాన్ని అంటేలా సాగాయని తెలిపారు. 21 రోజులపాటు బిఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. గురువారం భూపాలపల్లిలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయనని ప్రధాని మోడీ చెప్పి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బిజెపి అంటేనే బడా జూటా పార్టీ అని దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయిందని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బిజెపి దొంగనాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. మీడియాలో స్పేస్ కోసమే బండి సంజయ్ ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపిలో తన అధ్యక్ష పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక అయోమయస్థితిలో బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకు బిజెపి గ్రాఫ్ పడిపోతుందని గ్రహించే సిఎం కెసిఆర్‌పైనా, మంత్రి కెటిఆర్‌పైనా పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News