Friday, December 20, 2024

చేవెళ్ల గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేవెళ్ల గడ్డపై మూడో సారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ సృష్టిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నివాసంలో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కెసిఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కెసిఆర్ ను  ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

సబితా ఇంద్రారెడ్డి నివాసంలో ఎంపి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవీ, యెగ్గే మల్లేశం, దయనంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి , డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువ నేత కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News