Tuesday, April 1, 2025

ఈ ఏడాది ఏ ఎన్నిక జరిగినా బిఆర్‌ఎస్‌దే విజయం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు…
ఈ ఏడాది మళ్లీ ముఖ్యమంత్రిగా
పట్టం పట్టడానికి అవకాశం ఉంది
రేవంత్‌రెడ్డికి పదవీగండాలు ఎక్కువ
రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం
తెలంగాణ భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
పాల్గొన్న కెటిఆర్, పార్టీ సీనియర్ నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ఈ ఏడాది ఏ ఎన్నిక జరిగినా బిఆర్‌ఎస్‌దే విజయం అని పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. కెసిఆర్‌కు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది రైతులను పట్టించుకునే స్థితి ఉండదు అని, ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నామమాత్రంగానే ముందుకు వెళ్లడానికి అవకాశం ఉందని తెలిపారు. కుజుడు వ్యయ స్థానంలో స్తంభింపడి ఉన్నాడో.. కొద్దిరోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని అన్నారు.

సంవత్సరం ప్రారంభంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణలో అతివృష్టి ఉండే అవకాశం ఉన్నదని, పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. రైతులు తమ భూములకు అనుకూలించే పంటలు మాత్రమే వేయాలని, ముఖ్యంగా కొత్త పంటలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాలకుల మధ్య విభేదాలు వస్తాయని, అవి ప్రభుత్వ పాలన పైన దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని, పాలకులలో స్వార్థపూరిత ఆలోచనలు పెరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు రాష్ట్రానికి పలు ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలని, కొత్త పెట్టుబడులు పెట్టకూడదని పేర్కొన్నారు. సంవత్సరాంతంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ ఏడాది సిఎంగా మళ్లీ కెసిఆర్ అయ్యే అవకాశం

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ది కర్కాటక రాశి అని రాజేశ్వర సిద్ధాంతి వ్యాఖ్యానించారు. ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 ఉందన్నారు. ఆశ్లేష నక్షతం, కర్కాటక రాశిలో కెసిఆర్ జన్మించారని.. మేష లగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్చరుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడని చెప్పారు. బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనైశ్చరుడి ఇబ్బంది పోతుందని అన్నారు. ఫలితంగా కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ ఏడాది మళ్లీ ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉందని అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీది ధనుస్సు రాశి అని చెప్పారు. ఈ ఏడాది పార్టీపై మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బృహస్పతి సప్తమి స్థితిలో ఉన్నాడు కాబట్టి.. వార్డు మెంబర్ నుంచి ఎంఎల్‌ఎ, ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బిఆర్‌ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. కానీ రాజులు ఎన్నికలు పెట్టేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. వారి రాజ్యాధికారం కాపాడుకునేందుకే తాపత్రయ పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కోర్టులు ముందుకొచ్చి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు. కాబట్టి ఈ ఏడాదిలో వీలైనంత ఎక్కువగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు.
మే 14 నుంచి రేవంత్‌రెడ్డికి పదవీగండాలు ఎక్కువయ్యే అవకాశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కన్యా రాశి అని రాజేశ్వర సిద్ధాంతి చెప్పారు. ఈ రాశికి ఆదాయం 14, వ్యయం 2 రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుందని తెలిపారు. అయితే ఇన్ని రోజులు మంచి స్థితిలో ఉన్న బృహస్పతి మే 14 రోజున స్థాన చలనం చెందుతాడని చెప్పారు. అప్పటి నుంచి పదవీగండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News