Sunday, November 24, 2024

బిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీకి మద్దతు పలకాలి

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యాలయాలు మూసివేస్తుంది
భవిష్యత్తులో తెలంగాణలో అదే పరిస్ధితి తప్పదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందని, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యాలయాలకు తాళం వేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యుహాలను, అభ్యర్థుల ఎంపికపై పార్టీ నిర్వహించిన ఎన్నికల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామని, ఎక్కువగా పోటీ ఉండే స్ధానాలకు సంబంధించిన అభ్యర్థులు జాబితా సిద్దం చేసినట్లు త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.

తమ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయని, రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణలో బిజెపికి గెలిచేందుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ప్రజలనుంచి సానుకూల స్పందన కనబడుతోందని, ప్రతిపక్షాలు నైరాశ్యంగా ఉన్నాయన్నారు. వారి భవిష్యత్తు అంధకారంలో కనబడుతుందన్నారు. అదే విధంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామని, పిఎం మోడీ పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకమనే విషయాన్ని వివరించారన్నారు. రిజర్వేషన్లను నెహ్రూ అడ్డుకున్న విషయాన్ని బట్టబయలు చేశారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బిసి రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకించారని, కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని మండిపడ్డారు. మోడీ కులంపై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కులంపై రాహుల్ తప్పుడు వాఖ్యలు, అసంబద్ధ వాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీలో ఆయన కులం చేరింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటూ ఓబీసీ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ కులగణనను ఎక్కడా అడ్డుకోలేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News