Wednesday, January 22, 2025

నేడు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఎల్‌పి భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం మంగళవారం సమావేశం కానుంది. శాసనసభ వాయిదా పడిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఎల్‌పి భేటీ జరగనుంది.

బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఆరు గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్దత అంశాలను ప్రస్తావించాలని భావిస్తోంది.

రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చ జరగాలని కోరనుంది. గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలను ప్రస్తావించాలన్న ఆలోచనలో బిఆర్‌ఎస్ ఉంది. మంగళవారం బిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంలో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల సూచనలకు అనుగుణంగా మరి కొన్ని ఇతర అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.

కాగా, ఈ నెల 23 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్న విషయం విదితమే. మంగళవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. బిఎసి మీటింగ్‌లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఇక 25న అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News