ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే వెన్నుపోటు పొడిచే వాళ్ళు తాము వద్దంటే దిక్కలేక వెళ్లి పోయారంటూ మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఖమ్మం వేదికగా హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రం భక్తరామదాసు కళాక్షేత్రంలో 6589మంది పోడు రైతులకు 13,139.05 ఎకరాలకు సంబంధించిన పట్టాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 50,595 మంది పోడు రైతులకు గాను 1,51,195 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తమ పార్టీ వద్దన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ముద్దు అయ్యారని, ఇకపై పార్టీలో శకుని పాత్రలు పోషించేవారు ఉండరన్నారు. విజయానికి అడ్డుగా ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆనాడు సీట్లు గెలవకుండా చేశారని ఆయనపై మండిపడ్డారు. ఆయన వెళ్ళడం వల్ల ఏదో జరుగుతుందనుకుంటున్నారు అసలు ఏం జరగదని, తాము వద్దన్న వాళ్ళను వాళ్ళకు దిక్కులేక చేర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఆర్థిక అరాచకవాది, రాజకీయ నాయకుడే కాదు గుత్తేదారుడు అని విమర్శించిన మల్లు భట్టి విక్రమార్కకు ఇప్పుడు ఆయన ఎందుకు అవసరం అయ్యారో భట్టే చెప్పాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీన్ రివర్స్ కాబోతుందని, ఆనాడు ఒక్కటి గెలిచి తొమ్మిది సీట్లు పోయ్యాయని రేపు తొమ్మిది గెలిచి ఒక్కటి మాత్రమే పోతదన్నారు.
శకుని పాత్రలన్ని పోయినందునా సిదా సిదా కొట్లాడుతామని ఆయన పోయినంత మాత్రనా మాకేమీ నష్టం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ అని, బిఆర్ ఎస్ చేతల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని మంత్రి నిలదీశారు. రేపు ఖమ్మానికి రాహుల్ గాంధీ వస్తున్నారంటే ఎవరో రాసిన స్క్రిఫ్ట్ చదవడం కాదు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తున్నారో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాయమాటలు చెప్పడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక వాగ్ధానాన్ని కూడా అమలు చేయలేదన్నారు. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తమ నాయకుడు కెసిఆర్ మ్యానిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేసి నిరూపించారన్నారు. ఓట్లు వేయించుకున్నంత వరకే కాంగ్రెస్ వాళ్ళ పని అని ఆ తరువాత ఒడ్డుదాటిన తరువాత బోడ మల్లయ్య అవుతారన్నారు.
రాష్ట్రాన్ని ఆరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు మెడికల్ కళాశాలను ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం 3438 కోట్ల నిధులను ఖర్చు చేస్తే కేవలం తొమ్మిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో గిరిజనుల కోసం 18,500 కోట్ల నిధులను ఖర్చు చేశామని మంత్రి వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన తండాలను, గూడెలను గ్రామ పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చి 2471 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. 2018 ఎన్నికల్లో పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆచరణలో పట్టాలను అందిస్తున్నామన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ పట్టాల పంపిణీని మధ్యలోనే నిలిపివేస్తారని చెబుతున్నాడని, కాని వాస్తవంగా మధ్యలో పట్టాల పంపిణీని నిలిపివేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
ఆనాడు మూడన్నర లక్షల మందికే పట్టాలను పంపిణీ చేసి వదిలి వేయడం వల్లనే నేడు ఈ సమస్య వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో ఆసరా పింఛన్ రూ.2000/4000 వేలు ఇస్తున్న రాష్ట్రం ఉందా..? రైతుబంధు, రైతు బీమా పథకాలు ఇస్తున్న రాష్ట్రం ఉందా అని మంత్రి హరిశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణ లక్ష్మీ అమలు జరుగుతుందా లేదా.? మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారా లేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులాంటిది కట్టారా.లేదా. కేసీఆర్ కిట్లు ఇస్తున్నారా లేదా చెప్పాలన్నారు.కాంగ్రెస్ పాలనలో రైతన్నలు కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయలేదా దమ్ముంటే చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు లేవా ఖమ్మం వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. పోడు పట్టాలు పొందిన రైతులకు వారం రోజుల్లో రైతు బంధు తోపాటు అకాల మరణం చెందితే రైతు బీమా, ఉచిత విద్యుత్, రాయితీతో కూడిన వ్యవసాయ యంత్రికరణ పనిముట్లు వంటి అనేక సౌకర్యాలు లభించబోతున్నాయని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గిరిజనులంతా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 6589 మంది పోడు రైతులకు 13,139.04 ఎకరాలకు సంబంధించి పొడుభూములకు పట్టాల పంపిణీ చేసినట్లు తెలిపారు.
2005లో రూపొందించిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం మేరకు పోడు భూముల్లో సాగుచేస్తున్న వారికి హక్కుదార్లుగా పట్టాలు ఆందజేసినట్లు తెలిపారు. పట్టాలు పొందిన వారికి రైతుబంధు, రైతుబీమా తదితర అన్ని ప్రభుత్వ ఫలాలు అందుతాయని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని 77 గ్రామ పంచాయతీలు, 9 మండలాల పరిధిలో ఉన్న 6589 మంది పోడు రైతులకు గాను 13,139.04 ఎకరాలు పోడు రైతులకు పాస్ పుస్తకాలను మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి పంపిణీ చేశారు. తొలుత అకాల మరణం చెందిన వేద గాయకుడు సాయి చంద్ మృతి పట్ల మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళ్ళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు రాములు నాయక్, హరిప్రియ నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, కార్పొరేటర్ పాలేపు వెంకటరమణ విజయ , మాజీ ఎమ్మెల్యేలు మధన్ లాల్, బానోత్ చంద్రావతి, అధికారులు పాల్గొన్నారు