రైతుబంధు నిధులు రూ. 550.14 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల 306.38 ఎకరాలకు నిధులు విడుదల అయ్యయాని ,ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 45 వేల 700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ అయ్యయాని అన్నారు. ఖమ్మం బిఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదని తెలిపారు.
దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనున్నదని, ఖమ్మం సభలో కెసిఆర్ సందేశం చారిత్రాత్మకం కానున్నదని మంత్రి వివరించారు. నాడు తెలంగాణ కోసం నేడు దేశం కోసం కెసిఆర్ ముందడుగు వేశారని అన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలని. 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్దిల్లాలని ఆయన ఆకాక్షించారు. అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఆహార రంగం మీద పడిందని, కెసిఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తామని ఆయన ధ్వజమేత్తారు.
తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని , బిఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నదని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ మీద కక్ష్యగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని మండిపడ్డారు. బిజెపికి ప్రజలే సమాధానం చెబుతారని ఒక పత్రికా ప్రకటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.