Wednesday, January 22, 2025

వచ్చేది బిఆర్‌ఎస్సే… ప్రతీకారం తీర్చుకుంటాం : కెటిఆర్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

గువ్వల బాలరాజుపై దాడి
పరామర్శించిన కెటిఆర్, హరీశ్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంఎల్‌ఎ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేది బిఆర్‌ఎస్ సర్కారే అని, తాము వచ్చాక కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. అచ్చంపేటలో రాళ్ల దాడిలో గాయపడిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజును అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రులను చూసి బాలరాజు ఎమోషనల్ అయ్యారు. కెటిఆర్‌తో గొడవ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే తమపై దాడులకు చేస్తున్నారని కెటిఆర్‌కు ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు కుటుంబ సభ్యులు వివరించారు.

తెలంగాణ ఉద్యమకాలంలో ఎన్నో దాడులను ఎదుర్కొని పోరాడిన నాయకుడు బాలరాజు అని కెటిఆర్ వివరించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్యగా మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. దాడులు చేసే సంస్కృతికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని బాలరాజు కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిన డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ‘ఉద్యమ కాలంలో ఎన్నో దాడుల్ని తట్టుకుని బాలరాజు నిలబడ్డారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ పెంచాలని డిజిపిని కోరుతాం. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో ఆయనపై దాడి చేశారు. రాష్ట్రంలో దాడుల సంస్కృతి మంచిది కాదు. బాల రాజు సతీమణిని కూడా కించపరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే. దాడులకు పాల్పడిన వారిపై రివేంజ్ తీర్చు కుంటాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. దళితబిడ్డపై కాంగ్రెస్ దాడులు చేస్తే ఆ పార్టీ అణగారిన వర్గాలకు ఇస్తున్న గౌరవమేంటీ’ అని అన్నారు. శనివారం అర్థరాత్రి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు తన కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అలాగే ఎంఎల్‌ఎ కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. సమాచారమందు కున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గువ్వలకు గాయలవ్వడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసు పత్రికి తరలించారు. మొన్నటికి మొన్న దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీపై కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలోని కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాలకుర్తి సభలో అడ్డొచ్చిన కార్యకర్తలను తన్ని గాయపరిచారు. దాడులను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తుండటంతో కార్యకర్తలు సైతం గూండాగిరి ప్రదర్శిస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ దాడిని ఖండించారు.
ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే:  ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జి
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శనివారం అచ్చంపేటలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణలో ఆయన గాయపడిన విషయం విదితమే. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం కాసేపటి క్రితం ఆయన డిశ్చార్జి అయ్యారు. రాజకీయాల్లో వ్యక్తిగత, భౌతిక దాడులు సరికాదని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. “శనివారం రాత్రి కొందరు వ్యక్తులు నా కారును అడ్డుకొని నాపై దాడి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాలతో బతికి బయటపడ్డా. నా అనుచరులపైనా దాడి చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదు. నాపై గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించారు. రాత్రి స్వయంగా ఆయనే దాడులు చేయించారు. వీరి దాడులకు భయపడేది లేదు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతా.” అని గువ్వల బాలరాజు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News