Wednesday, January 22, 2025

ఎపిలో దంపతుల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Brutal murder of a couple in AP

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో సునీత, కృష్ణారావు అనే దంపతులను దోపిడి దొంగలు దారుణం హత్య చేశారు. దొంగతనం కోసం ఇంటికి వెళ్లిన దుండగులు డబ్బులు నగలు ఇవ్వాలంటూ సునీత అనే మహిళను కర్రతో కొట్టి చంపేశారు. నగలు, డబ్బు కోసం వెతికినా దొరకకపోవడంతో వెనుదిరిగిన దొంగలకు అదే సమయంలో ఇంటికి వస్తున్న యజమాని కృష్ణారావు వారిని అడ్డుకోవడంతో అగంతకులు అతన్ని దారుణంగా గొంతు కోసి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు నగరంలోని పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు(54), సునీత(50) దంపతులు నివాసముంటున్నారు. వీరి ఇద్దరు కుమారులు ప్రేమ్‌చంద్, సాయిచంద్‌లకు వివాహాలు కావడంతో వేర్వేరుగా నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్ శాఖలో ఉద్యోగి కాగా చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్ నడిపిస్తున్నారు.

పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే ఉంటున్నారు. కృష్ణారావు స్థానికంగా కరెంట్ ఆఫీస్ సెంటరు వద్ద శ్రీరామ్ పేరుతో క్యాటరింగ్, హోటల్ నడిపిస్తున్నారు. ప్రతీరోజు కృష్ణారావు హోటల్ మూసేసి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుండటంతో శనివారం రాత్రి కూడా భర్త వస్తారని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా పడక గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారని తెలుసుకుని లోనికి ప్రవేశించి పడక గదిలో నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం దుండగులు బంగారు ఆభరణాలు, నగల కోసం బీరువాలో వెతికినప్పటికీ ఏమీ దొరకలేదు.దీంతో దొంగలు ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో వరండా దగ్గరే దుండగులకు కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే తమతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి రాగానే దారుణాన్ని చూసి కృష్ణారావు బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర ఇన్‌ఛార్జి డిఎస్‌పి అబ్దుల్ సుబహాన్, స్థానిక ఇన్‌స్పెక్టరు నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగింది? హత్య ఎలా చేశారనే వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో దర్యాప్తు జరిపించారు. కాగా మృతురాలు వాసిరెడ్డి సునీత టిడిపి సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తుండటంతో పోలీసులు రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేయాలని స్థానిక టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఘటనా స్ధలం సమీపంలో పడి ఉన్న కర్ర, కత్తిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దంపతుల హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా లేక దోపిడీ దొంగలు ఈ పని చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News